![]() |
![]() |

హైదరాబాద్ శివారులో నాగశౌర్య కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్‌లో క్యాసినో తరహాలో జోరుగా జూదం జరుగుతున్నట్లు వెల్లడైంది. పోలీసులు జరిపిన దాడిలో పలువురు వ్యక్తులు పేకాటతో పాటు పోకర్ చిప్స్‌తో గాంబ్లింగ్ ఆడుతున్నట్లు గుర్తించారు. జూదం ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని, వారి దగ్గర నుంచి సుమారు రూ. 25 లక్షల మేర నగదును స్వాధీనం చేసుకున్నారు. గుత్తా సుమంత్ అనే వ్యక్తి ఈ జూదాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అతని కాల్ లిస్టులో పొలిటికల్, బిజినెస్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ ఫామ్‌హౌస్‌కు అసలు యజమాని పేరు రమణ. దీన్ని నాగశౌర్య పేరెంట్స్ ముల్పూరి శంకర్‌ప్రసాద్, ఉషలకు ఐదేళ్ల కాలానికి లీజుకు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల నాగశౌర్య సినిమా వరుడు కావలెను రిలీజ్ అవడంతో, ఆ సందర్భంగా వారు తమ ఫామ్‌హౌస్‌లో పార్టీ అరేంజ్ చేసుకుని ఉంటారని తాను అనుకున్నట్లు ఆయన చెప్పారు. అదివరకు ఓసారి బర్త్‌డే పార్టీ చేసుకున్నారనీ, అది తప్ప అక్కడ వేరే ఎలాంటి పార్టీలు జరిగినట్లు తాను చూడలేదని ఆయన తెలిపారు. గతంలో సుమంత్ అనే వ్యక్తిని తానెప్పుడూ చూడలేదని కూడా ఆయన అన్నారు.
కాగా ఫామ్‌హౌస్‌లో జూదం ఆడుతున్న ప్రదేశం నుంచి పోలీసులు నగదుతో పాటు స్వైపింగ్ మెషీన్లు, చిప్స్, పేకాట కార్డ్స్ లాంటి వాటిని స్వాధీనం చేసుకొన్నారు. అక్కడున్న ఖరీదైన కార్లను సీజ్ చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. త్వరలో నాగశౌర్య కుటుంబానికి నోటీసులివ్వవచ్చని తెలుస్తోంది.
![]() |
![]() |