![]() |
![]() |

కన్నడ స్టార్ యాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక, నమ్మశక్యం కాని మృతితో యావత్ దేశంలోని సినీ ఇండస్ట్రీ షాక్‌కు గురయ్యింది. 46 ఏళ్ల వయసుకే గుండెపోటుతో ఉదయం మాసివ్ హార్ట్ ఎటాక్‌కు గురైన పునీత్‌ను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. హాస్పిటల్‌కు వచ్చిన సమయానికే ఆయన అవయావాలేవీ పనిచేయడం లేదని వారు తెలిపారు. ఎంతో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండే ఆయన మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్‌కు కర్నాటక వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా హై అలర్ట్ ప్రకటించడమే కాకుండా, సినిమా హాళ్లను మూసివేయించింది. పలుచోట్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బృందాలను మోహరించింది.
పునీత్ మృతికి అన్ని భాషలకు చెందిన సినీ సెలబ్రిటీలు పలువురు తీవ్ర దిగ్భ్రాంతినీ, విచారాన్నీ వ్యక్తం చేస్తున్నారు. పునీత్ లేడన్న వార్త వినగానే తన హృదయం బద్దలైనట్లు అనిపించిందని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేశారు. కన్నడ సినిమాకూ, భారతీయ సినిమాకూ ఆయన లేని లోటు తీరనిదని ఆయన పేర్కొన్నారు. "నేను కలుసుకున్న వారిలో అత్యంత వినయశీలురైన యాక్టర్లలో పునీత్ ఒకరు." అని హీరో రామ్ నివాళులర్పించాడు.
"చాలా త్వరగా వెళ్లిపోయావ్ అప్పు. నా హృదయం బద్దలైంది. ఇది ఫెయిర్ కాదు. #BlackFriday " అంటూ ట్వీట్ చేశారు నటుడు ప్రకాశ్‌రాజ్. "నా హృదయం బద్దలైంది పునీత్ రాజ్‌కుమార్ అన్నా. ఇది ఫెయిర్ కాదు" అని మంచు మనోజ్ రాసుకొచ్చారు.
మంచు లక్ష్మి, "ఓరి దేవుడా.. నో. ఇది నిజం కాకూడదు. ఇదెలా అవుతుంది? ఫ్యామిలీకి నా ప్రగాఢ సంతాపం. చాలా తర్వగా వెళ్లిపోయారు." అన్నారు. హీరో సుధీర్‌బాబు, "సినీ వర్గాల్ని తీవ్ర దుఃఖంలో వదిలేసి ఒక స్టార్ చాలా త్వరగా వెళ్లిపోయారు. ఎప్పటికీ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటాం" అని ట్వీట్ చేశారు.
"నా హృదయం ముక్కలైంది. నిన్నెప్పుడూ మిస్సవుతుంటాను సోదరా" అని సోను సూద్ అన్నారు.
![]() |
![]() |