![]() |
![]() |

సినిమావాళ్లలోనే కాకుండా, రెండు రాష్ట్రాల్లోని సినీ అభిమానుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు వారబ్బాయి విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మెగా కాంపౌండ్ ఎంతగా సపోర్ట్ చేసినప్పటికీ అంతిమంగా ప్రకాశ్‌రాజ్ ఓటమి పాలయ్యారు. పది రోజుల ముందు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ స్వీప్ చేస్తుందనే అభిప్రాయం ఉండగా, రోజులు గడిచే కొద్దీ క్రమంగా విష్ణు వైపు ఎక్కువ మంది మొగ్గుచూపుతూ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రకాశ్‌రాజ్‌పై 107 ఓట్ల తేడాతో విష్ణు ఘనవిజయం సాధించారు.
ఆఫీస్ బేరర్లలో ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లోని శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా విష్ణు ప్యానల్‌లోని బాబూ మోహన్‌పై ఘన విజయం సాధించారు. అలాగే జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ కూడా విజయం సాధించారు. ఈ రెండు పదవులు తప్పితే మిగతా వారిలో విష్ణు ప్యానల్‌లోని వారే విజయాలు సాధించడం గమనార్హం. జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్‌పై రఘుబాబు 7 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. కోశాధికారిగా నాగినీడుపై శివబాలాజీ విజయం సాధించారు. అలాగే విష్ణు ప్యానల్ నుంచి పృథ్వీ, మాదాల రవి, గౌతంరాజు కూడా గెలుపొందారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా రెండు ప్యానళ్ల మధ్య పోటీ తీవ్రంగా జరిగింది. ఇక్కడ మెజారిటీ మాత్రం ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు దక్కింది. ఆయన ప్యానల్ నుంచి 10 మంది, విష్ణు ప్యానల్ నుంచి 8 మంది ఈసీ సభ్యులుగా విజయం సాధించారు.
'మా' ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో, అందులోనూ ఆఫీస్ బేరర్లు అత్యధిక సంఖ్యలో గెలుపొందడంతో విష్ణు వర్గం సంబరాల్లో మునిగి తేలుతోంది. మొదట్నుంచీ ప్రకాశ్‌రాజ్ అధ్యక్షుడిగా నిల్చోవడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చి, విష్ణు ప్యానల్‌గా గట్టి మద్దతుదారునిగా నిల్చొని, ఆ ప్యానల్ తరపున తీవ్రంగా ప్రచారం చేసిన ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ ఆనందానికి అవధులు లేవు.
![]() |
![]() |