![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అత్యధికంగా 75 శాతం పోలింగ్ నమోదయింది. ఇటీవలి కాలంలో 'మా' ఎన్నికల్లో ఈ స్థాయి పోలింగ్ నమోదవడం ఇప్పుడే. ఓటింగ్ శాతం పెరగడం తమకు అనుకూలమని విష్ణు ప్యానల్ మెంబర్స్ ఘంటాపథంగా చెబుతున్నారు. ప్రకాశ్‌రాజ్‌నూ, ఆయన ప్యానల్‌నూ ఓడించడానికే యాక్టర్లు ఓటింగ్‌కు తరలి వచ్చారని వారు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రకాశ్‌రాజ్ వర్గం సైతం గెలుపు తమదేననే ధీమాతో ఉన్నారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ముగియాల్సి ఉండగా, విష్ణు, ప్రకాశ్‌రాజ్‌లతో చర్చించి మరో గంట పొడిగించారు ఎలక్టొరల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్. మధ్యాహ్నం 3 గంటలయ్యే సరికల్లా 605 ఓట్లు పోలైనట్లు ఆయన ప్రకటించారు. 'మా'లో 925 మంది సభ్యులుండగా, వారిలో 883 మందికి ఓటు హక్కు ఉంది. పోస్టల్ బ్యాలట్ ద్వారా 60 ఓట్లు పోలయ్యాయి. వెరసి.. 665 ఓట్లు పోలైనట్లయింది. మొత్తం ఓట్లలో ఇది 75 శాతం. రెండేళ్ల క్రితం ఎన్నికల్లో 60 శాతం లోపే ఓట్లు పోలయ్యాయి.
ముంబై నుంచి జెనీలియా, ఢిల్లీ నుంచి జయప్రద వచ్చి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విష్ణు ఫోన్ చేయడంతో జెనీలియా, మోహన్‌బాబు ఫోన్ చేయడంతో జయప్రద వచ్చి తమ ఓటు వేశారు. అయితే స్టార్ హీరోలైన మహేశ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తమ ఓటు హక్కుని వినియోగించుకోకపోవడం గమనార్హం. 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదట ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా గెలుపొందిన వారిని ప్రకటించి, ఆ తర్వాత అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన వారిని ప్రకటించనున్నారు. రాత్రికల్లా ఫలితాలు వెలువడుతాయని ఆశిస్తున్నారు.
![]() |
![]() |