![]() |
![]() |

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రకుల్‌ప్రీత్ సింగ్ ప్రేమలో పడింది. అఫిషియల్‌గా తన బాయ్‌ఫ్రెండ్ ఎవరో జనానికి చెప్పేసింది. బాలీవుడ్ యంగ్ హీరో జాకీ భగ్నానితో తను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఫొటోతో వెల్లడించింది రకుల్. అదే ఫొటోను జాకీ సైతం షేర్ చేసి, తమ అనుబంధాన్ని ధ్రువీకరించాడు. ఆదివారం రకుల్ 31వ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె తన లవ్ లైఫ్‌ను ప్రపంచానికి వెల్లడించడం గమనార్హం.
రకుల్‌కు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బర్త్‌డే విషెస్ చెప్పిన జాకీ, తన ప్రపంచమంతా ఆమేనని తెలిపాడు. "నువ్వు లేకుండా, రోజులు రోజుల్లాగా కనిపించవు. నువ్వు లేకుండా, అత్యంత రుచికరమైన ఆహారం కూడా సహించదు. నాకు ప్రపంచమైన అత్యంత అందమైన మనసుకు బర్త్‌డే శుభాకాంక్షలు పంపుతున్నాను. నీ రోజు నీ నవ్వు అంత ప్రకాశవంతంగా, నీ అంత అందంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే మై రకుల్‌ప్రీత్" అని అతను రాసుకొచ్చాడు.
ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని నడుస్తున్న ఫొటోను షేర్ చేసిన ఫొటోనే తనూ షేర్ చేసిన రకుల్, ఈ బర్త్‌డేకి ఇది తనకు అతిపెద్ద గిఫ్ట్‌గా అభివర్ణించింది. "థాంక్యూ మై లవ్! ఈ ఏడాది నువ్వు నా అతిపెద్ద గిఫ్ట్. నా లైఫ్‌కు రంగుల్ని జోడించిన నీకు, నన్ను నిరంతరం నవ్వేలా చేస్తున్న నీకు థాంక్ యు. కలిసి మరిన్ని జ్ఞాపకాల్ని ప్రోదిచేసుకుందాం" జాకీ భగ్నాని అని ఆమె రాసింది.

ఆ ఇద్దరు లవ్ బర్డ్స్‌కు రాశీ ఖన్నా, కృతి సనన్, టైగర్ ష్రాఫ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, ఆయుష్మాన్ ఖురానా లాంటి యాక్టర్లు విషెస్ తెలిపారు.
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ వశు భగ్నాని కుమారుడైన జాకీ వయసు 36 సంవత్సరాలు. 2009లో 'కల్ కిస్‌నే దేఖా' మూవీతో నటుడిగా పరిచయమైన జాకీ.. ఫాల్తు, అజయ్ గజబ్ లవ్, రంగ్రేజ్, యంగిస్తాన్, మిత్రోం సినిమాల్లో నటించాడు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సరబ్‌జిత్, జవానీ జానేమన్, కూలీ నంబర్ 1, బెల్ బాటమ్ సినిమాలు నిర్మించాడు.
![]() |
![]() |