![]() |
![]() |
.jpg)
'మా' ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ ప్యానల్ మేనిఫెస్టోను మంచు విష్ణు ప్రకటించారు. గురువారం ఏర్పాటుచేసిన మీడియా మీట్‌లో ఆయన, "ఇది తెలుగు నటుల ఆత్మగౌరవానికి సంబంధించిన మేనిఫెస్టో మాత్రమే కాదు, తెలుగు సినిమా ఆత్మగౌరవానికి సంబంధించిన మేనిఫెస్టో." అని ప్రకటించారు. అవకాశాలు లేని నటులకు అవకాశాలు కల్పించడం, పేద కళాకారులు పిల్లలకు పీజీ దాకా చదువుకోవడానికి సాయం చేయడం, 'మా' భవనం సొంత డబ్బులతో కట్టించడం, అర్హులైన కళాకారుల కూతుళ్ల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించడం, మహిళా ఆర్టిస్టుల రక్షణ నిమిత్తం హై పవర్ కమిటీని ఏర్పాటు చేయడం వంటివి ఆయన ప్రకటించిన మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు.
"మా మేనిఫెస్టోలో మొదటి పాయింట్.. అవకాశాలు. కొంతమంది నటులకు అవకాశాలు లేవు. వాళ్లకు సినిమా అవకాశాలు రావడం కష్టంగా ఉంది. వాళ్లందరూ మా ప్రయారిటీ. ఈ జనరేషన్‌కు ఇప్పుడు అవసరమైన ఒక యాప్ రెడీ చేస్తాం. అందులో కాస్టింగ్ కాల్స్ ఉంటాయి. ఈ యాప్ యాక్సెసబిలిటీని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌కు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక జాబ్ కమిటీ ఏర్పరుస్తున్నాం. ఈ జాబ్ కమిటీ అందరు ప్రొడ్యూసర్స్ దగ్గరకు, ప్రొడక్షన్ హౌసెస్ దగ్గరకు వెళ్లి, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ దగ్గరకు వెళ్లి, మా రోస్టర్‌లో ఉన్న ఆర్టిస్టుల అందరి పోర్ట్‌ఫోలియో చూపించి, రిక్వెస్ట్ చేసి, వాళ్లతో అనుసంధానమవుతాం. నిర్మాతలు దేవుళ్లు. వాళ్లు లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండదు. ఆర్టిస్టులందరికీ వాళ్లు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం". అని చెప్పారు విష్ణు.
"మొత్తం 'మా' కుటుంబం కోసం మేమొక భవనం కట్టుకుంటాం. ఈ భవనాన్ని నా సొంత డబ్బుతో నేను కడతాను. దీని కోసం ఇప్పటికే మూడు స్థలాలు చూశాం. 'మా' పెద్దల సలహాలు తీసుకొని వాటిలో ఒక స్థలంలో మేం కడతాం." అని ఆయన హామీ ఇచ్చారు.
"మా మేనిఫెస్టోలో మరో అంశం.. 'చదువుల తల్లి'. మా సభ్యుల్లో అర్హులైన వారి పిల్లలకు కేజీ నుంచి పీజీ దాకా చదువుకోడానికి మేం సహకారం అందిస్తాం. మా సభ్యుల పిల్లలకు స్కాలర్‌షిప్ ఇస్తామని ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీలు మాటిచ్చాయని గర్వంగా చెప్తున్నాను. నేను మా ప్రెసిడెంట్ అయిన మూడు నెలలలోగా మేం ఎలాంటి యూనివర్సిటీలతో టైయప్ పెట్టుకున్నామో తెలియజేస్తాను." అని విష్ణు చెప్పారు.
"అలాగే 'కల్యాణ లక్ష్మి' పేరిట అర్హులైన మా సభ్యుల పిల్లల పెళ్లిళ్లకు ఒక లక్షా పదహారు వేల రూపాయల దాకా సహాయం చేస్తాం." అన్నారు.
"మరో పాయింట్.. మహిళా రక్షణ హై పవర్ కమిటీ. మా చరిత్రలోనే ఇలాంటిది ఫస్ట్ టైమ్. మా సభ్యులైన మహిళలందరికీ అన్ని వేళలా సాయం చేయడానికి మేం అందుబాటులో ఉంటాం. వయసుతో నిమిత్తం లేకుండా అర్హులైన సింగిల్ మదర్, సింగిల్ వుమన్‌లకు ఆర్థిక సాయం అందిస్తాం." అని విష్ణు వెల్లడించారు.
![]() |
![]() |