![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఈ నెల 10 న జరగనున్న సంగతి తెలిసిందే. మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఉన్నారు. ఇరు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తూ సినీ పెద్దల మద్దతుతో నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. ప్రకాష్ రాజ్ కి మద్దతుగా మెగా ఫ్యామిలీ ఉందని మొదటి నుండి వినిపిస్తున్న మాట. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన మెగా బ్రదర్ నాగబాబు.. తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానల్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రకాష్ రాజ్ దేశం గర్వించదగిన నటుడని నాగబాబు కొనియాడారు. లోకల్, నాన్ లోకల్ అంటూ సంకుచిత భావనతో మాట్లాడటం కరెక్ట్ కాదని హితవు పలికారు. అన్నయ్య చిరంజీవి సూచనతోనే ప్రకాష్ రాజ్ కి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఐడలాజికల్ డిపరెన్స్ ఉండొచ్చు.. కానీ 'మా'కు ఏమైనా కావాలంటే మోదీ, అమిత్ షాతో మాట్లాడి ప్రకాష్ రాజ్ ఏదైనా తేగలగుతాడు. మీ ఫ్యానల్కు ఆ దమ్ముందా? అంటూ మంచు విష్ణు ప్యానల్ ను ప్రశ్నించారు నాగబాబు. పవన్ కళ్యాణ్ వైపు ఉంటావా? ఇండస్ట్రీ వైపు ఉంటావా? అని ప్రకాష్ రాజ్ ని మంచు విష్ణు అడగడాన్ని నాగబాబు తప్పుబట్టారు. అసలు ఏం ఆలోచిస్తున్నారు? పవన్ తెలుగు ఆర్టిస్ట్ కాదా? అంటూ చురకలు వేశారు.
తాను ఒక మాట విన్నానని.. అది నిజమా అబద్ధమా తనకు తెలియదని.. మా ఎన్నికల్లో ఆర్టిస్టులకు డబ్బు ఆశ చూపిస్తున్నారని అన్నారు. మా ఎన్నికల్లో విజయం సాధించేందుకు కొందరు ఓటుకు రూ.10వేలు ఇస్తున్నారని ఆరోపించారు. గతంలో తాను మా అసోసియేషన్ మాసకబారిపోయింది అన్నానని.. కానీ ఇప్పుడు నిజంగానే మా మాసకబారబోతుంది అన్నారు. మా అసోసియేషన్ మెంబర్స్ ప్రతిష్టను దిగజార్చడానికి కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
![]() |
![]() |