![]() |
![]() |

మన తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టుల కంటే ప్రకాశ్‌రాజ్ గొప్ప యాక్టర్ అనీ, గొప్ప క్యారెక్టర్ యాక్టర్‌గా అతను వేరే లెవల్లో ఉన్నాడనీ ఆకాశానికెత్తేశారు నాగబాబు. ఆ విషయం ఒప్పుకొమ్మనమని తెలుగు యాక్టర్లకు సూచించారు కూడా. 'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు మెగా కాంపౌండ్ మొదట్నుంచీ సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్యానల్ తరపున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకాశ్‌రాజ్ నటనను విపరీతంగా పొగిడారు నాగబాబు. అతను భారతీయ నటుడనీ, అలాంటివాడిని కన్నడ నటుడని వేరు చేయడమేంటనీ ప్రశ్నించారు.
"నాతో పాటు చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండేవారు. ప్రకాశ్‌రాజ్ కన్నా మాకేం తక్కువయ్యా అనేవారు. వాడు మనకన్నా మంచి యాక్టర్.. ఒప్పుకోండ్రా అన్నాను. అలా అన్నవాళ్ల పేర్లు చెప్తాను తర్వాత. అతని టాలెంట్ ఏంటి? మనమందరం యాక్సెప్ట్ చేయాలి. హి ఈజ్ సమ్‌వేర్. గొప్ప క్యారెక్టర్ యాక్టర్‌గా ఎక్కడో ఓ లెవల్లో ఉన్నాడు. అందుకే ఐదుసార్లు నేషనల్ అవార్డ్ తీసుకున్నాడు." అని అన్నారాయన.
"ప్రకాశ్‌రాజ్ నిలబడతానంటే తను షాకయ్యాననీ, అతను ఇటువేపు వస్తాడని అనుకోలేదనీ నాగబాబు చెప్పారు. అతను సో బిజీ, సో టాలెంటెడ్. టైమ్ ఇవ్వగలుగుతావా? అనడిగాను. 'మా'కు 100 శాతం టైమ్ ఇస్తాను అన్నాడు. అవసరమైతే కొన్ని సినిమాలు కూడా వదులుకుంటాను అని నాకు ప్రామిస్ చేశాడు. ఒక సినిమాకు కోటి రూపాయలు తీసుకుంటున్నాడు. ఒక సినిమా పోతే కోటి పోయినట్లే. అయినా పనిచేస్తానని ముందుకొచ్చాడు. అలాంటి ప్రకాశ్‌రాజ్ కర్నాటక నటుడా? తెలుగోడా? అతను భారతీయ నటుడు. అతను ఇండియాకు రిప్రజెంట్ చేస్తున్నాడు. అతను నటించిన లాంగ్వేజ్ సినిమా లేదు. చాలా అరుదైన ప్రతిభ ఉన్న వ్యక్తి." అని అన్నారు నాగబాబు.
ప్రకాశ్‌రాజ్‌కూ, బీజేపీ ప్రభుత్వానికీ భావజాల పరమైన డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పిన ఆయన, "కానీ 'మా'కు ఏదైనా సమస్య వస్తే.. డైరెక్టుగా నరేంద్ర మోదీ తోటీ, అమిత్ షా తోటీ మాట్లాడగలిగి, ఏదైనా తేగల దమ్మున్నోడు. అలాంటి దమ్ము మీ (విష్ణు మంచు) ప్యానల్‌కు ఉందా? లేదు." అని తీర్మానించేశారు.
"ఎంతకాలం నేను, నాది అనే సంకుచిత ఆలోచనలు చేస్తారు? మనుషులుగా మనం ఎదగాలి." అని ఆయన సూచించారు. "కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ లాంటి సీనియర్ నటులు ప్రకాశ్‌రాజ్ ఎవరు అంటున్నారు. ఇంత జెలసా? ప్రకాశ్‌రాజ్‌కు దీనివల్ల పది రూపాయలేమన్నా లాభమా? ఏమైనా కిరీటాలు పెడతామా? నెత్తిమీద ఇది ముళ్లకిరీటం లాంటిది. దాన్ని భరిస్తానని ముందుకొచ్చాడు. అలాంటివాడికి కదా మనం సపోర్ట్ చెయ్యాలి." అని నీతులు చెప్పారు నాగబాబు.
![]() |
![]() |