![]() |
![]() |

మెలోడీస్ తో మెస్మరైజ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిక్కీ జే మేయర్.. తన క్వాలిటీ వర్క్ తో ముచ్చటగా మూడు నంది పురస్కారాలు, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు. అయితే `హ్యాపీ డేస్`, `కొత్త బంగారు లోకం`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `అ ఆ`, `శతమానం భవతి`, `మహానటి`, `ఓ బేబి`, `గద్దలకొండ గణేశ్`.. ఇలా చెప్పుకోదగ్గ సంఖ్యలో హిట్స్ ఉన్నా ఎందుకనో స్టార్ కంపోజర్ అనిపించుకోలేకపోయారు మిక్కీ జే మేయర్. ఈ నేపథ్యంలో.. రాబోయే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పైనే ఆశలు పెట్టుకున్నారాయన.
ఆ చిత్రాలే.. `శ్యామ్ సింగ రాయ్`, `ప్రాజెక్ట్ కె`. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న `శ్యామ్ సింగ రాయ్` ఓ పిరియడ్ డ్రామా కాగా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ - వరల్డ్ వెంచర్ `ప్రాజెక్ట్ కె` ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ. ఈ రెండు చిత్రాలకి కూడా నేపథ్య సంగీతం కీలకమే. ఇప్పటికే `మహానటి` చిత్రం కోసం బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా తన మార్క్ చూపించిన మిక్కీ.. ఈ రెండు చిత్రాల్లో అంతకుమించి పనితనం చూపగలిగితే స్టార్ డమ్ సొంతం చేసుకోవడం పక్కా అంటున్నారు విశ్లేషకులు. మరీముఖ్యంగా.. `ప్రాజెక్ట్ కె` మిక్కీ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం కావడంతో అందరి కళ్ళూ ఈ సినిమాపైనే ఉన్నాయడంలో అతిశయోక్తి కాదు. చూడాలి మరి.. మిక్కీ భవిష్యత్ ఎలా ఉండబోతుందో!
కొనమెరుపు ఏంటంటే.. `శ్యామ్ సింగ రాయ్` ఆ చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కి మూడో సినిమా కాగా.. `ప్రాజెక్ట్ కె` నాగ్ అశ్విన్ కి మూడో చిత్రం.
![]() |
![]() |