![]() |
![]() |
.jpg)
తెలుగు సినీ కళాకారులు పెట్టుకున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎన్నడూ లేనంత వివాదాస్పదంగా, గోలగోలగా జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో కన్నడ నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తుండటం దీనికి ఓ కారణం. ఆశ్చర్యకరంగా ఆయన మెగా కాంపౌండ్ మద్దతుతో బరిలోకి దిగారు. నాగబాబు బహిరంగంగా ప్రకాశ్‌రాజ్‌కు సపోర్ట్ ఇవ్వడమే కాకుండా, తమ అన్నయ్య చిరంజీవి సపోర్ట్ కూడా ఆయనకు ఉందని బాహాటంగా ప్రకటించారు. దానికి తోడు చిరంజీవి వీరాభిమానులైన శ్రీకాంత్, బ్రహ్మాజీ, ఉత్తేజ్ లాంటి నటులు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ తరపున 'మా' ఎన్నికల్లో పోటీపడుతున్నారు.
అయితే ఒక పరభాషా నటుడికి తెలుగు ఆర్టిస్టుల సంఘంపై అజమాయిషీకి కట్టబెట్టడమేంటనే అభిప్రాయంతో ఉన్నవారు ప్రకాశ్‌రాజ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. 'మా'ని నడుపుకోవడం మనకు చేతకాక, కర్నాటక నుంచి వచ్చిన నటుడికి ఆ బాధ్యతల్ని అప్పగిస్తారా? అని పలువురు సీనియర్ ఆర్టిస్టులు ప్రశ్నిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ ప్రెసిడెంట్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మంచు విష్ణు తానే అధ్యక్షుడిగా పోటీలో నిలబడ్డారు. బాబూమోహన్, రఘుబాబు లాంటి సీనియర్లను కలుపుకొని తన ప్యానల్‌ను బరిలో నిలిపారు.
900 మంది సభ్యులున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు అక్టోబర్ 10న జరగబోతున్నాయి. ఒక చిన్న సంఘమైన 'మా' ఎన్నికలు ఇంత రచ్చరచ్చగా మారడం అందర్నీ విస్తుపోయేలా చేస్తున్నాయి. అసలు 'మా'కు అధ్యక్షుడిగా నిలబడాలనే ఆలోచన ప్రకాశ్‌రాజ్‌కు ఎందుకు వచ్చింది? ఎందుకాయన ఈ అసోసియేషన్ పెత్తనాన్ని ఆశిస్తున్నారనే చర్చలు ఇండస్ట్రీలో నడుస్తున్నాయి. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ప్రకాశ్‌రాజ్ తన ప్రవర్తన కారణంగా క్రమశిక్షణా చర్య కింద 'మా' నుంచి నిషేధానికి గురయ్యారు. అప్పుడాయన ఫిల్మ్‌చాంబర్ ప్రాంగణం దగ్గర నిరసనలకు కూడా దిగారు. ఆ తర్వాత ఆ నిషేధాన్ని 'మా' ఎత్తివేసింది.
ఈ నేపథ్యంలో ఏ అసోసియేషన్ అయితే ఒకప్పుడు తనను బ్యాన్ చేసిందో, అదే అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా మారి, అందులోని సభ్యులపై అజమాయిషీ చేయాలనే ఉద్దేశంతోనే ప్రకాశ్‌రాజ్ ఎన్నికల్లో నిలబడ్డారని ఇండస్ట్రీలో పలువురు భావిస్తున్నారు. ఇదే ప్రశ్నను 'ఆలీతో సరదాగా' షోలో అలీ నోట నుంచి రావడం గమనార్హం. అయితే ఆ విషయాన్ని తానెప్పుడో మర్చిపోయాననీ, మీరే దాన్ని గుర్తుచేశారనీ ప్రకాశ్‌రాజ్ పైకి చెప్పినా, దాన్నెవరూ నమ్మడానికి సిద్ధంగా లేరనేది వాస్తవం.
ఇప్పటికే రాజీవ్ కనకాల, రవిబాబు లాంటి నటులు ప్రకాశ్‌రాజ్ అభ్యర్థిత్వంపై బాహాటంగా వ్యతిరేకతను వ్యక్తం చేశారు. "మనమంత చేతకానివాళ్లమా? మనలో చేవలేదా? బయటివ్యక్తికి దాన్ని నడిపే అవకాశం ఇవ్వాలా?" అని రాజీవ్ కనకాల ప్రశ్నించారు. స్థానిక, స్థానికేతర అంశం గురించి తాను మాట్లాడటం లేదంటూనే 'మా'ను మనం నడుపుకోలేమా? మనకు చేతకాదా? దాన్ని కూడా బయటి వ్యక్తి చేతికి అప్పగించాలా?.. అని నటుడు-దర్శకుడు రవిబాబు ఆవేశంగా ప్రశ్నించారు.
జగపతిబాబు లాంటి నటులు బాహాటంగా చెప్పకపోయినా, ప్రకాశ్‌రాజ్‌కు వ్యతిరేకంగా ఓటేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ప్యానల్‌లో మిగిలిన వారెవరైనా గెలిచినా ఫర్వాలేదు కానీ, ప్రకాశ్‌రాజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదని పలువురు సీనియర్ ఆర్టిస్టులతో పాటు యంగ్ యాక్టర్స్ సైతం భావిస్తున్నారు. సాధారణంగా ఓటింగ్‌కు దూరంగా ఉండే ఆర్టిస్టులు సైతం ఈసారి ప్రకాశ్‌రాజ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడానికి రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తున్న మాట.
![]() |
![]() |