![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు టాలీవుడ్ లో కాక రేపుతున్నాయి. ఈ ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తూ.. ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగుతున్నారు. ఇక తాజాగా తన ప్యానల్ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన ప్రకాష్ రాజ్.. విష్ణు టీమ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
మా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను మిస్ యూజ్ చేస్తున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన తన ప్యానల్ సభ్యులతో కలిసి మా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కరోనా కాలంలో 60 ఏళ్ళు నిండిన వారికి పోస్టల్ బ్యాలెట్స్ పంపించాలన్న నిర్ణయాన్ని తాము స్వాగతించామని ప్రకాష్ రాజ్ తెలిపారు. అయితే ఇందుకు కొన్ని రూల్స్ ఉన్నాయని.. సెప్టెంబర్ 30 లోపు 60 ఏళ్ళు నిండిన వారు స్వయంగా లెటర్ రాసి, సంతకం చేసి ఎలక్షన్ ఆఫీసర్ కి పంపించాలని అన్నారు. కానీ విష్ణు టీమ్ అందరి దగ్గరికి వెళ్లి సంతకాలు తీసుకొని, వాళ్ళే లెటర్స్ రాసి.. అన్నింటికీ ఒకే కవర్ లో పెట్టి ఇచ్చారట. అంతేకాదు మొత్తం 60 కి పైగా పోస్టల్ బ్యాలెట్స్ వస్తే.. అందులో 56 మందికి ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఒకేసారి రూ.28,000 మోహన్ బాబు కంపెనీకి చెందిన మేనేజర్ కట్టారని చెబుతూ రసీదును మీడియాకు చూపించారు ప్రకాష్ రాజ్. ఇలా గెలిస్తే అది గెలుపు కాదని ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు శ్రీకాంత్, జీవిత రాజశేఖర్ కూడా అసహనం వ్యక్తం చేశారు. మోహన్ బాబు, విష్ణు అడిగారని ప్రముఖులు వాళ్ళకి ఓటేసి పేద కళాకారులకు అన్యాయం చేయొద్దని.. దానికంటే అసలు ఓటు వేయకుండా ఉండటం మంచిదని జీవిత అన్నారు. ఇక శ్రీకాంత్ అయితే.. ఇలా అయితే ఎన్నికల్లో పాల్గొనడం కూడా వేస్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
![]() |
![]() |