![]() |
![]() |

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు కలిశారు. దిల్ రాజు, డీవీవీ దానయ్య, నవీన్ ఎర్నేని, సునీల్ నారంగ్, బన్నీ వాసు ఈరోజు(శుక్రవారం) పవన్ నివాసానికి వెళ్లి.. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలపై చర్చించారు.
ఆన్‌లైన్ టికెట్ల వ్యవహారంపై గత కొన్ని రోజులుగా రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా 'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. దీంతో ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతలు పవన్ పై ఎదురుదాడికి దిగారు. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పవన్ కామెంట్స్‌తో ఇండస్ట్రీకి సంబంధం లేదని ప్రకటనలు చేశారు. అంతేకాదు టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాతలు కొందరు ఏపీ మంత్రి పేర్ని నానితో సమావేశమై.. అనంతరం ఆన్ లైన్ టికెట్ వ్యవస్థను తామే కోరామని మీడియాకి తెలిపారు. చిరంజీవి సైతం పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. దీంతో టాలీవుడ్ లో పవన్ ఒంటరి అవుతున్నారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ టైంలో ఊహించని విధంగా నిర్మాతలు పవన్ ని కలవడం హాట్ టాపిక్ గా మారింది.
గురువారం ఏపీ మంత్రితో చర్చలు జరిపిన సినీ నిర్మాతలు.. తాజాగా పవన్ ను కలిసి సినీ రంగంలో ఉన్న సమస్యల గురించి చర్చించారు. పవన్ వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటనలిచ్చిన వారే.. ఇప్పుడు పవన్ ను కలిసి సమస్యల గురించి చర్చించడం విశేషం. ఆన్‌లైన్ టికెట్ల వ్యవహారంతో పాటు చిత్ర పరిశ్రమ కు సంభందించిన పలు సమస్యల గురించి వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అంతే కాదు.. రాజకీయాల్లోకి చిత్ర పరిశ్రమను లాగొద్దని పవన్ ను నిర్మాతలు కోరినట్లు సమాచారం.
![]() |
![]() |