![]() |
![]() |

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ'. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఆ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా సంతోషపడుతున్నారు. కొత్త కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం పట్ల ఆయన ఖుషీ అవుతున్నారు. విజయవాడలో దర్శకుడు శేఖర్ కమ్ముల విలేకర్లతో మాట్లాడుతూ, ఈ చిత్రం తనకు ప్రత్యేకమైనదని చెప్పారు.
అయితే తన దర్శకత్వంలో వచ్చిన అన్ని చిత్రాలు తన వాయిస్ వినిపించాయని... కానీ 'లవ్ స్టోరీ' చిత్రం మాత్రం తన వాయిస్‌ను మరింత బలంగా వినిపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఫిదా' విడుదలైన మూడేళ్ల తర్వాత 'లవ్ స్టోరీ' చిత్రం వచ్చిందని శేఖర్ కమ్ముల ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డానని ఆయన తెలిపారు. ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ యాక్టర్ ఆమిర్ ఖాన్ వచ్చారని... వారి రాకతో ఈ చిత్రంపై అంచనాలు బారీగా పెరిగాయన్నారు.
ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారని శేఖర్ కమ్ముల చెప్పారు. హీరోయిన్ సాయి పల్లవితో డ్యాన్స్ చేసేందుకు హీరో నాగ చైతన్య కొద్దిగా సిగ్గు పడ్డారని ఆయన నవ్వుతూ అన్నారు. ఈ చిత్రానికి కోరియోగ్రాఫర్‌గా పని చేసిన శేఖర్‌కు ఈ సందర్బంగా శేఖర్ కమ్ముల ధన్యవాదాలు తెలిపారు. తన దర్శకత్వంలో వచ్చిన తొమ్మిది చిత్రాలు .. భిన్నమైన సందేశాలు ఇచ్చే విధంగా ఉన్నాయన్నారు.
తన దర్శకత్వంలో వచ్చిన 'గోదావరి' చిత్రం అయితే తనకు భిన్నమైన పాఠాన్ని నేర్పిందన్నారు. ఇక 'ఫిదా'లో సాయి పల్లవికి తెలంగాణ యాస కరెక్ట్‌గా సరిపోయిందని.. అలాగే 'లవ్ స్టోరీ' చిత్రంలో కూడా సాయి పల్లవికి తెలంగాణ యాసనే ఉంచానని శేఖర్ కమ్ముల తెలిపారు. ఈ చిత్రంలో సాయి పల్లవి మాటలను చూసి.. ఆంధ్ర ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రారో అనే కొద్దిపాటి సందేహం ఉండేదని..ఆ సందేహాన్ని ఆంధ్ర ప్రేక్షకులు పటాపంచలు చేశారని దర్శకుడు శేఖర్ కమ్ముల సంతోషం వ్యక్తం చేశారు.
![]() |
![]() |