![]() |
![]() |
.jpg)
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. థియేటర్లపై ప్రభుత్వ పెత్తనమేంటని ఆయన ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీని వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. అయితే పవన్ హీరోగా ఇటీవలే 'వకీల్ సాబ్' మూవీని నిర్మించిన దిల్ రాజు ఈ విషయంలో ఆయనతో విభేదించారు. ట్రాన్స్‌పరెన్సీ కోసం తామే ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మాలని ప్రభుత్వానికి సూచించామని చెప్పారు.
"ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లను వీళ్లెందుకు తీసుకోవాలనుకుంటున్నారు? అక్కడి ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు. చిత్రపరిశ్రమలో వచ్చిన సంపద గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్తే, దానిమీద తమకు ఇంత ఆదాయం వస్తోందని బ్యాంకులకు చూపించవచ్చు, వాటి దగ్గర్నుంచి లోన్లు తెచ్చుకోవచ్చు. దానిలో భాగంగానే చిత్రపరిశ్రమ డబ్బులతో లోన్లు తీసుకోబోతున్నారు" అన్నారు పవన్ కల్యాణ్.
ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కొంతమంది బడా నిర్మాతలు మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిని కలిశారు. వారిలో డీవీవీ దానయ్య, దిల్ రాజు, యువి క్రియేషన్స్ వంశీ, మైత్రి మూవీ మేకర్స్ ఎర్నేని నవీన్, ఏసియన్ సునీల్, బన్ని వాస్ ఉన్నారు. పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని మంత్రికి వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంలో దిల్ రాజు "అదివరకు ఓసారి మేం ప్రభుత్వాన్ని కలిసినప్పుడే ఇటు నిర్మాతలకు గానీ, అటు గవర్నమెంట్‌కు గానీ ట్రాన్స్‌పరెన్సీ కోసం ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టమ్ తేవాలని అడిగాం. అన్ని థియేటర్లలో ఆన్‌లైన్ సిస్టమ్ రావాలనేది మా కోరిక. అదే గవర్నమెంట్‌కు చెప్పాం. ఆన్‌లైన్ టికెటింగ్‌ను గవర్నమెంటే పెట్టేస్తది, డబ్బంతా గవర్నమెంట్ దగ్గరే ఉంటది.. ఇలా ఇటీవల రకరకాలుగా వ్యూస్ ఉన్నాయి" అని చెప్పారు. సినిమా అనేది చాలా సున్నితమైన విషయం కాబట్టి దయచేసి ఎవరూ దానికి సంబంధించిన విషయాల్ని కాంట్రవర్సీలోకి తీసుకెళ్లవద్దు అని కూడా ఆయన అభ్యర్థించారు.
ఆయన చెప్పిన దాన్ని బట్టి సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్ముతారు కానీ, అమ్మేది గవర్నమెంట్ కాదన్న అర్థం వస్తోంది. మరి ఆ వ్యవస్థను ఎవరి ఆధ్వర్యంలో నడుపుతారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
![]() |
![]() |