![]() |
![]() |

'లవ్ స్టోరీ' దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి మనం సంస్కారం నేర్చుకోవాలని సీనియర్ హీరో నాగార్జున అన్నారు. "ఆయన చాలా సెన్సిటివ్ డైరెక్టర్. ఆయన థీమ్స్ అన్నింటిలో సెన్సిటివిటీ ఉంది.. కానీ అవి సరిపోవు.. దానికి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో బ్యాలెన్స్ చేసి సినిమా తీయాలి. దానిని శేఖర్ కమ్ముల నేర్చుకున్నార"ని హీరో నాగార్జున తెలిపారు. అన్ని ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కించబట్టే 'లవ్ స్టోరీ' హిట్టయిందని ఆయన పేర్కొన్నారు. 'లవ్ స్టోరి' సక్సెస్ మీట్‌లో ఆయన ఎమోషనల్‌గా మాట్లాడారు.
నిర్మాత నారాయణ దాస్ నారంగ్‌తో తన తండ్రి ఎన్నార్ అనుబంధాన్ని ఈ సందర్బంగా నాగార్జున గుర్తు చేసుకున్నారు. "నాతో సినిమా తీయకుండా.. చైతుతో సినిమా తీసి.. సూపర్ హిట్ చేశారు" అంటూ నారంగ్‌పై నాగ్ ప్రశంసల జల్లు కురిపించారు. 'లవ్ స్టోరి' ఓ క్లాసిక్ ఫిల్మ్ అని.. ఇలాంటి చిత్రాలు అప్పుడప్పుడూ వస్తుంటాయని ఆయన పేర్కొన్నారు.
కొడుకు గురించి మాట్లాడుతూ, నాగచైతన్యను చూస్తుంటేనే కడుపు నిండిపోతుందన్నారు. ఈ సినిమా చూశాక ఇంకా సంతోషమేసిందని నాగార్జున చెప్పారు. "యాక్టర్, స్టార్ ఇవి రెండు వేర్వేరు పదాలు. కానీ చైతూను ఒక స్టార్ యాక్టర్‌గా తయారు చేశావు" అంటూ శేఖర్ కమ్ములకు నాగ్ థ్యాంక్స్ చెప్పారు. "చైతన్య.. నువ్వు చాలా ఫెంటాస్టిక్‌గా నటించావు.. ఈ సినిమా చూసి నేను నవ్వేలా, ఏడ్చేలా చేశావు" అన్నారు నాగార్జున.
హీరోయిన్ సాయి పల్లవిని అయితే నాగ్ ఆకాశానికి ఎత్తేశారు. సాయి పల్లవి వండర్‌ఫుల్ యాక్టర్ అని ఆయన అభివర్ణించారు. ఆమె డాన్స్ చేస్తుంటే సమ్ స్పిరిట్ కనిపిస్తుందని.. ఆమె చుట్టు వంద మంది సాయి పల్లవిలు డాన్స్ చేస్తున్నట్లు ఉంటుందన్నారు. ఆమె కాళ్లు గాలిలో తేలినట్లు ఉంటాయని చెప్పారు. "నువ్వు ఏ క్యారెక్టర్ చేసినా ఆ మ్యాజిక్ కనిపిస్తుంది.. నీకు అది గొప్ప గిఫ్ట్" అని సాయి పల్లవికి నాగ్ కితాబు ఇచ్చారు. "మీ తాతగారికి 'అన్నమయ్య' సినిమానే చూపిస్తూ ఉండూ" అంటూ సాయి పల్లవిని నాగార్జున ఆటపట్టించారు.
ఏఎన్నార్ నటించిన 'ప్రేమనగర్' రిలీజ్ అయి సెప్టెంబర్ 23కు 50 ఏళ్లు అయింది. అదే తేదీన 'లవ్ స్టోరి' రిలీజ్ అయ్యింది. "ప్రేమనగర్ టైమ్‌లోనూ తుఫాన్ ఉంది... లవ్ స్టోరీ రిలీజ్‌కు తుఫాన్ ఉంది. ఈ రెండు చిత్రాలు గొప్ప విజయాన్ని సాధించాయి" అని నాగార్జున గుర్తు చేశారు. తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమిస్తారని.. ఇకపైనా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానని నాగార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాల పనితీరును ఆయన కొనియాడారు. "తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ మమ్మల్ని మంచి చూపుతో చూశాయి.. కరోనా కట్టడికి ప్రభుత్వాలు వేగంగా స్పందించాయి" అని నాగార్జున చెప్పారు.
![]() |
![]() |