![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు అసెంబ్లీ, పార్లమెంట్ రాజకీయాలను తలపిస్తున్నాయ్. టాలీవుడ్‌కు చెందిన 'మా' ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న కన్నడ నటుడు ప్రకాశ్‌రాజ్, రకరకాల ఎత్తులతో 'మా' మెంబర్స్‌ను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. ఆదివారం ఆయన ప్యానల్ 'మా' సభ్యులతో జరిగిన విందు సమావేశం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి వాతావరణం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ చూడలేదంటూ పలువురు నటులతో పాటు ఇతర క్రాఫ్టులకు చెందిన పలువురు కళాకారులు, నిర్మాతలు వాపోతున్నారు. పరస్పరం అభిప్రాయాలు పంచుకుందాం అంటూ ఆదివారం ప్రకాశ్‌రాజ్ 'మా' సభ్యులతో విందు రాజకీయం నిర్వహించారు.
దీనిపై నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఫైర్ అయ్యారు. ఓవైపు జనం కరోనా కారణంగా ఇబ్బందులు పడుతుంటే, ఇలాంటి సమయంలో విందు సమావేశాలేంటి అని ఆయన ప్రశ్నించారు. "'మా' కళాకారులనందర్నీ ఒక దగ్గరకు చేర్చి, విందులు, సన్మానాలంటూ రకరకాల పేర్లతో వారందరినీ ఒక దగ్గరకు చేర్చవద్దు. ఎందుకంటే గత రెండేళ్ల నుంచీ ప్రతి ఒక్కరం కరోనా భయంతో నాలాంటి వాళ్లు ఎంతోమంది చావు దాకా వెళ్లొచ్చారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, మీకు ఓటు కావాలంటే వారికి ఫోన్‌చేసి మనం చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి, మీరు చేయబోయే వాటి గురించి చెప్పండి. అంతే కానీ, ఈ విందుల పేరుతో ఒక దగ్గరకు చేర్చి, వారి జీవితాలతో చెలగాటం ఆడొద్దని నా కోరిక" అంటూ ఓ వీడియో ద్వారా సూచించారు.
బండ్ల గణేశ్ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సంక్లిష్ట కాలంలో విందు రాజకీయాలు కరెక్ట్ కాదని బండ్లను సమర్థిస్తున్నారు. కాగా, బండ్ల గణేశ్ వ్యాఖ్యాలపై సహజంగానే ప్రకాశ్‌రాజ్ ప్రతిస్పందించారు. "బండ్ల గణేశ్ గారైతే గుజరాత్‌లో ఎందుకు ఎలక్షన్ చేశారు, అవతల ప్యానల్ వారు కూడా ఎందుకు మీటింగ్‌లు పెడుతున్నారు అని కూడా మాట్లాడాలి కదా!.. ఆయన చెప్పింది కూడా కరెక్టుగా ఉండొచ్చేమో.. అయితే మేం తగినవిధంగా ప్రోటోకాల్స్ పాటిస్తున్నాం. ఆ ప్లేస్‌ను శానిటైజ్ చేశాం, మాస్క్‌లు ధరించాం" అని చెప్పారు.
![]() |
![]() |