![]() |
![]() |
.jpeg)
నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' మూవీ సెప్టెంబర్ 10న థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఏమాత్రం కొత్తదనం లేదనీ, రెగ్యులర్ ఓల్డ్ స్టోరీ, స్లో నెరేషన్‌తో బోర్ కొట్టించిందనీ అత్యధిక ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. నానికి వరుసగా ఓటీటీ వేదికపై ఇది రెండో ఫ్లాప్ అని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదివరకు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో నాని నెగటివ్ రోల్ చేసిన 'వి' మూవీ కూడా నేరుగా ఓటీటీలో విడుదలై ఫ్లాపయింది. ఇప్పుడు 'టక్ జగదీష్' కూడా అదే బాట పడుతోందని ప్రాథమిక అంచనా తెలియజేస్తోంది.
కాగా ఈ సినిమాలో ఒక కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములను కలపడానికి వాళ్లింటికి నాని వెళ్లే సీనుంది. అందులో నానిని వాళ్లు బెదిరిస్తుంటే, భోజనానికి కూర్చున్న నాని షర్టు వెనక నుంచి పొడవాటి కత్తిని బయటకు తీస్తాడు. దానితో ఉల్లిపాయను ముక్కలుగా తరుగుతూ డైలాగులు చెప్తాడు. తరగడం పూర్తయ్యాక ఆ కత్తిని విసురుతాడు. అది వెళ్లి చెక్క స్తంభానికి గుచ్చుకుంటుంది. అప్పుడు ఆ అన్నదమ్ములకు కనువిప్పు కలుగుతుంది.
అయితే ఇప్పుడు ఈ సీనుకు సంబంధించి ఓ అభిమాని రాసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం.. నాని షర్టులోంచి కత్తి తీస్తున్న ఫొటోను ఫస్ట్ లుక్ కింద 2020 డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేశారు. దాన్ని షేర్ చేసిన డైరెక్టర్ శివ నిర్వాణ, "ట్రెమండస్ రెస్పాన్స్ ఫర్ టక్ జగదీష్ ఫస్ట్ లుక్. థాంక్యూ వన్ అండ్ ఆల్" అంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. అయితే అశ్విన్ అనే ఓ అభిమాని అదే రోజు శివ నిర్వాణ పోస్ట్‌కు రిప్లై ఇస్తూ, "అని నువ్వు అనుకుంటే సరిపోదుగా అన్నా! 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయ్) లుక్ లాగే ఉంది. నథింగ్ న్యూ. అండ్ ఆ కత్తి ఎలాగో ఏదో కామెడీ సీన్‌కు అయ్యుంటది. నిమ్మకాయో.. ఉల్లిపాయో.. కొయ్యడానికి.. ఆ నాన్ వెజ్‌లోకి" అని కామెంట్ పెట్టాడు.
సరిగ్గా అతను ఊహించినట్లే సినిమాలో నాన్ వెజ్ భోజనానికి కూర్చున్న నాని ఉల్లిపాయ కోయడానికే ఆ కత్తిని బయటకు తీశాడు. ఆ అభిమాని ఊహాగానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు నెటిజన్లు. మొత్తానికి 'టక్ జగదీష్' పరిస్థితి కామెడీ లాగే తయారయ్యింది. నిర్మాతలు సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసి, మంచిపనే చేశారనీ, థియేటర్లలో రిలీజ్ చేసుంటే బయ్యర్లు మునిగిపోయేవారనీ పలువురు కామెంట్ చేస్తున్నారు.
![]() |
![]() |