![]() |
![]() |
.jpg)
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాశ్‌రాజ్ రానున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన ప్యానల్‌ను ఆయన రెండు సార్లు ప్రకటించారు. అధ్యక్ష బరిలో ఉన్న హీరో మంచు విష్ణు ఇంతవరకూ తన ప్యానల్‌ను ప్రకటించలేదు. అయితే ఆయనకు సీనియర్ నటుల నుంచి సపోర్ట్ ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ లాంటి నటులు విష్ణువైపు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రకాశ్‌రాజ్‌కు మెగా కాంపౌండ్ సపోర్ట్ లభించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని చిరంజీవి తమ్ముడు నాగబాబు బాహాటంగా ప్రకటించారు. కాగా అధ్యక్ష బరిలో ఉన్న జీవిత, హేమ.. అనూహ్యంగా ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లో చేరడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ప్రస్తుత 'మా' కమిటీలో జనరల్ సెక్రటరీగా ఉన్న జీవిత మరోసారి ఆ పదవి కోసం ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లో చేరడం, హేమ వైస్ ప్రెసిడెంట్‌గా అదే ప్యానల్ నుంచి బరిలో దిగడం మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలను తలపిస్తున్నాయి.
అసలు ప్రకాశ్‌రాజ్‌కు 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ఎందుకనిపించింది? స్వతహాగా కన్నడిగుడైన ప్రకాశ్ రాయ్ అలియాస్ ప్రకాశ్‌రాజ్ తెలుగువారి సినిమా సంఘానికి పెత్తనం వహించాలని ఎందుకనుకుంటున్నారు? అని కొందరు ఆరా తీస్తున్నారు. 'మా' ఎన్నికల గురించిన ఎలాంటి ప్రకటనలు రాకమునుపే చాలా రోజుల క్రితం ఆయన నాగబాబు, శ్రీకాంత్ లాంటివారితో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి, తన ప్యానల్‌ను ప్రకటించడం ఇండస్ట్రీలోని పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
అంతకు మూడు నాలుగు నెలల క్రితం నుంచే ఆయన మా అధ్యక్ష పదవిపై కన్నేసినట్లు తెలుస్తోంది. అప్పటి ప్రెస్‌మీట్‌లోనే నాగబాబు ఈ విషయాన్ని బ్రేక్ చేశారు. అంతకు రెండు మూడు నెలల క్రితమే తనను ప్రకాశ్‌రాజ్ కలిసి, మా అధ్యక్షునిగా పోటీ చేయాలని ఉందని తనతో చెప్పారనీ, 'మా' కోసం తానేం చేయాలనుకుంటున్నారో ఆయన వివరించడంతో ఇంప్రెస్ అయ్యాననీ అప్పుడు నాగబాబు చెప్పారు.
తెలుగు సినిమాల్లో నటించేవారు 'మా' మెంబర్‌షిప్ తీసుకోవాలనీ, లేదంటే నిర్మాతలతో కానీ, మరెవరితో కానీ నటులకు ఏమైనా ఇబ్బందులు వస్తే, 'మా' మెంబర్ కానివారికి తాము ఎలాంటి సహాయం చేయలేమనీ 'మా' బాధ్యులు చెప్తుంటారు. అందువల్ల సౌత్‌లోని మిగతా ఇండస్ట్రీలకు చెందిన నటులు, నార్త్ నుంచి వచ్చిన పలువురు నటులు 'మా' సభ్యత్వం తీసుకున్నారు.
ప్రకాశ్‌రాజ్ సైతం అలా 'మా' సభ్యత్వం తీసుకున్నవారే. 'మా' మెంబర్ అవడం వేరు, 'మా'కు సంబంధించిన అత్యున్నత పదవిలో కూర్చోవడం వేరని పలువురు నటులు అభిప్రాయపడుతున్నారు. ఒక తెలుగు నటుడు తమిళ చిత్రసీమకు చెందిన 'నడిగర సంగమ్'పై పెత్తనం చేయడానికి తమిళ నటులు ఒప్పుకుంటారా? అలాగే కన్నడిగులైనా, మలయాళ నటులైనా తమ సంఘాలను ఏలే పదవికి ఒక తెలుగు నటుడు పోటీ చేస్తానంటే రానిస్తారా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
నటులకు భాషాభేదం, లోకల్-నాన్ లోకల్ భేదం ఉండదనేది నిజం. కానీ తెలుగువారికి చెందిన సినిమా పరిశ్రమ మద్రాసులో ఉండటం వల్ల సొంత అస్తిత్వం లేనట్లుగా ఉంటోందని భావించి కదా, హైదరాబాద్‌కు తరలివచ్చింది?! అలాంటప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం ఏమైంది? ఒక పరభాషా నటుడికి అధ్యక్ష పీఠం కట్టబెట్టి, అతనికింద తాము పనిచేస్తామని కొంతమంది నటులు ఎందుకు తయారవుతున్నారు? అని పలువురు సీనియర్ నటులు ప్రశ్నిస్తున్నారు. మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిన కొత్తలో, ఎన్నో కష్టాలు పడ్డామనీ, ఎంతో శ్రమకోర్చి ఇక్కడ ఇండస్ట్రీని నిలదొక్కుకొనేలా చేశామనీ, అలాంటిది ఇప్పుడు చూస్తూ చూస్తూ ఒక కన్నడ నటుడిని అందలం ఎక్కించడానికి కొంతమంది తెలుగు నటులు తెగ ఆరాటపడుతుండటం బాధ కలిగిస్తోందనీ వారంటున్నారు. తాము ప్రకాశ్‌రాజ్‌కు ఓటేసే ప్రశ్నే లేదని తేల్చి చెబుతున్నారు.
![]() |
![]() |