![]() |
![]() |

``అన్నదమ్ముల్లో పిల్లలు లేని వారు తమ సోదరుల పిల్లాడినే దత్తత తీసుకోవడం`` అనే అంశం చుట్టూ అల్లుకున్న చిత్రం `కలసి వుంటే కలదు సుఖం`. నటరత్న నందమూరి తారక రామారావు, మహానటి సావిత్రి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ డ్రామాకి తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. శివాజీ గణేశన్, బి. సరోజాదేవి జంటగా నటించిన తమిళ చిత్రం `భాగ పిరివినై` (1959)కి రీమేక్ వెర్షన్ గా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ అవిటివాడి పాత్రలో కనిపించి అలరించారు. ఎస్వీ రంగారావు, సూర్యకాంతం, హరనాథ్, గిరిజ, రేలంగి, అల్లు రామలింగయ్య, పెరుమాళ్ళు, హేమలత, రమాదేవి, పద్మిని ప్రియదర్శిని ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ జనరంజక చిత్రానికి ఆచార్య ఆత్రేయ సంభాషణలు సమకూర్చారు. సారథి స్టూడియోస్ పతాకంపై వై. రామకృష్ణ ప్రసాద్, సీవీఆర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మాస్టర్ వేణు స్వరాలందించిన ఈ చిత్రంలో పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ఎన్టీఆర్, సావిత్రిపై చిత్రీకరించిన ``ముద్దబంతి పూలుపెట్టి`` (ఘంటసాల, సుశీల గానం - కొసరాజు సాహిత్యం) గీతం ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. అలాగే ``కలసి వుంటే కలదు సుఖం``, ``గణనాథుని``, ``నా వరాల తండ్రి`` వంటి పాటలు కూడా రంజింపజేశాయి. 1961 సెప్టెంబర్ 8న విడుదలై అఖండ విజయం సాధించిన `కలసి వుంటే కలదు సుఖం`.. నేటితో 60 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |