![]() |
![]() |
.jpg)
పేరుకి మలయాళ సంగీత దర్శకుడైనా.. తనవైన మెలోడీలతో తెలుగునాట కూడా స్వరకర్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గోపీ సుందర్. `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` (2015)తో మొదలుకుని `మజిలీ` (2019) వరకు గోపీ అందించిన బాణీలు సంగీత ప్రియులను బాగానే ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉంటే.. గత ఏడాది గోపీసుందర్ కి అంతగా అచ్చిరాలేదనే చెప్పాలి. `ఎంత మంచివాడవురా`, `చూసీ చూడంగానే`, `వరల్డ్ ఫేమస్ లవర్`, `నిశ్శబ్దం`.. ఇలా గోపి సంగీతమందించిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో.. రాబోయే `టక్ జగదీష్`పైనే ఆశలు పెట్టుకున్నాడు గోపీసుందర్. ఈ సినిమాకి మరో స్టార్ కంపోజర్ తమన్ పాటలు అందించగా.. గోపీసుందర్ `టక్ సాంగ్`తో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు.
అంతేకాదు.. గతంలో అటు నేచురల్ స్టార్ నాని, ఇటు చిత్ర దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో చేసిన సినిమాలన్నీ గోపీకి మంచి ఫలితాన్ని అందించాయి. `భలే భలే మగాడివోయ్`, `మజ్ను`, `నిన్ను కోరి`.. ఇలా నాని హీరోగా నటించిన చిత్రాలకు గోపీసుందర్ బాణీలు అందించగా ఆయా సినిమాలు విజయపథంలో పయనించాయి. అలాగే.. `నిన్ను కోరి`, `మజిలీ` కోసం శివ నిర్వాణ కాంబినేషన్ లో పనిచేసిన గోపీకి సదరు రెండు సినిమాలు కూడా మంచి ఫలితాన్ని, గుర్తింపును తెచ్చాయి. ఈ నేపథ్యంలో.. తనకు అచ్చొచ్చిన నాని, శివ కాంబినేషన్ లో చేసిన `టక్ జగదీష్`తో గోపీసుందర్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
కాగా, వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న `టక్ జగదీష్` ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
![]() |
![]() |