![]() |
![]() |

``మతిమరపు ఉన్న యువకుడు ప్రేమలో పడితే ఎన్ని తిప్పలు పడ్డాడు? వాటిని తన సమయస్ఫూర్తితో ఎలా పరిష్కరించుకున్నాడు?`` అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న చిత్రం `భలే భలే మగాడివోయ్`. `ఈగ` (2012) తరువాత ట్రాక్ తప్పిన నేచురల్ స్టార్ నానిని మళ్ళీ సక్సెస్ రూట్ లోకి తీసుకువచ్చిన సినిమా ఇది. అలాగే దర్శకుడు మారుతికి అప్పటివరకు ఉన్న ఇమేజ్ ని పూర్తిగా మార్చివేసిన చిత్రమిది. మతిమరపు ఉన్న యువకుడిగా నాని పండించిన హాస్యం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవగా.. అతనికి జోడీగా నటించిన లావణ్య త్రిపాఠి తన అందచందాలతో ఆకట్టుకుంది. మురళీ శర్మ, నరేశ్, సితార, అజయ్, మధుమిత, వెన్నెల కిశోర్, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య కృష్ణన్, రాగిణి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
గోపీసుందర్ సంగీతమందించిన ఈ చిత్రంలో ``మొట్ట మొదటిసారి``, టైటిల్ సాంగ్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. కన్నడంలో `సుందరాంగ జాణ` (గణేశ్, శాన్వి), తమిళంలో `గజినీకాంత్` (ఆర్య, సాయేషా) టైటిల్స్ తో ఈ సినిమా రీమేక్ అయింది. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన `భలే భలే మగాడివోయ్`.. 2015 సెప్టెంబర్ 4న విడుదలై అఖండ విజయం సాధించింది. నేటితో ఈ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆరు వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |