![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా గుర్తుండిపోయే తేదీల్లో సెప్టెంబర్ 3 ఒకటి. ఎందుకంటే.. సరిగ్గా 28 ఏళ్ళ క్రితం అంటే 1993లో ఇదే తేదిన బాలయ్య నటించిన రెండు మాస్ ఎంటర్టైనర్స్ ఒకే రోజున థియేటర్స్ లో సందడి చేశాయి. ఆ సినిమాలే.. `నిప్పురవ్వ`, `బంగారు బుల్లోడు`. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు చిత్రాలు కూడా మ్యూజికల్ గా మెప్పించడమే కాకుండా.. బాక్సాఫీస్ ముంగిట శతదినోత్సవాలు జరుపుకోవడం విశేషం. ఈ రెండు సినిమాల్లోనూ ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రల్లో బాలయ్య కనిపించడమే కాకుండా తన అభినయంతో అభిమానులను అలరించారు.
ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన `నిప్పురవ్వ`లో బాలయ్యకి జోడీగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించగా.. బప్పీలహరి, రాజ్ - కోటి బాణీలు, ఎ.ఆర్. రెహమాన్ నేపథ్య సంగీతమందించారు. ఇక `బంగారు బుల్లోడు` విషయానికి వస్తే.. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, రవీనా టాండన్ నాయికలుగా నటించగా రాజ్ - కోటి సంగీతమందించారు. `నిప్పురవ్వ`లో సీరియస్ రోల్ లో ఎంతగా మెస్మరైజ్ చేశారో.. `బంగారు బుల్లోడు`లో ఎంటర్టైనింగ్ రోల్ లో అంతే ఆకట్టుకున్నారు బాలయ్య.
ఏదేమైనా.. ఓ స్టార్ హీరో నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజవడమే కాకుండా.. టాక్ తో సంబంధం లేకుండా శతదినోత్సవాలు జరుపుకోవడం అనేది బాలయ్య కే చెల్లింది.
![]() |
![]() |