![]() |
![]() |

నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌ను డ్రగ్ కేస్ షేక్ చేసింది. డ్రగ్ కేసులో పట్టుపడిన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అప్పట్లో తెలంగాణ ఎక్సైజ్ శాఖ పలువురు సెలబ్రిటీలను విచారించింది. చాలా రోజుల విచారణ అనంతరం వారికి డ్రగ్ వినియోగంతో కానీ, డ్రగ్ కొనుగోళ్లతో కానీ ఎలాంటి సంబంధం లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. అప్పుడు ఎక్సైజ్ అధికారులు విచారించిన వారిలో నటుడు రానా కానీ, నటి రకుల్‌ప్రీత్ కానీ లేరు.
అలాంటిది ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు పిలిచిన సెలబ్రిటీల లిస్టులో ఆ ఇద్దరూ ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. డ్రగ్ కేసులో దీన్ని ఓ మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం నాటి టాలీవుడ్ డ్రగ్ కేసులో లేని రానా, రకుల్‌కు ఈడీ నోటీసులు ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇవ్వడం వెనుక బలమైన కారణం ఉన్నట్లు భావిస్తున్నారు.
విదేశాలకు భారీ మొత్తంలో నిధులు తరలించి, భారత్‌కు డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తే, దానికి సొమ్ము చెల్లించెందెవరు? ఎవరి ఖాతాల నుంచి డబ్బు లావాదేవీలు జరిగాయి? అనే కోణంలో సెలబ్రిటీలను ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నేడు డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో ప్రారంభమయ్యే విచారణ సెప్టెంబర్ 22న హీరో తరుణ్‌తో ముగియనుంది. 6న రకుల్, 8న రానా ఈడీ ముందు హాజరు కానున్నారు.
ఇదివరకు బాలీవుడ్‌లో వెలుగుచూసిన డ్రగ్ కేసులో రకుల్‌ప్రీత్ పేరు వినిపించిన విషయం మనకు తెలుసు. కానీ రానా పేరు మాత్రం కొత్తగా ఈ కేసులోకి వచ్చింది. టాలీవుడ్‌కు చెందిన ఒక పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తిని డ్రగ్ కేసులో ఈడీ విచారించనుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
![]() |
![]() |