![]() |
![]() |

డ్రగ్ కేసు టాలీవుడ్‌లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. మనీ లాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘన అభియోగాలపై 12 మంది తెలుగు సినీ సెలబ్రిటీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ నిమిత్తం సమన్లు జారీ చేసింది. నేటి నుంచి వారి విచారణకు అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈరోజు టాప్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ ఈడీ ఆఫీసుకు హాజరయ్యారు. దీంతో ఈ డ్రగ్ కేసు ఏ మలుపు తీసుకుంటుందోననే ఆసక్తీ, ఆందోళన ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసులో ఇప్పటికే ఈడీ ముగ్గురు నిందితుల నుంచి స్టేట్‌మెంట్ తీసుకుంది. అందులో భాగంగా టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు బయటకు రావడంతో, వారికి నోటీసులు జారీ చేసింది. పూరి జగన్నాథ్ తర్వాత సినిమాల్లో ఆయన నిర్మాణ భాగస్వామి చార్మిని సెప్టెంబర్ 2న ఈడీ అధికారులు విచారించనున్నారు. సెప్టెంబర్ 6న హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, 8న హీరో-విలన్ రానా దగ్గుబాటి, 9న మాస్ మహారాజా రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్‌ను విచారించేందుకు ఈడీ రెడీ అవుతోంది.
ఆ తర్వాత సెప్టెంబర్ 13న నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్, 15న ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ ముమైత్ ఖాన్, 17న యువనటుడు తనీశ్, 20న నటుడు నందు, 22న హీరో తరుణ్ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరవనున్నారు. వీరితో పాటు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ విచారించిన 50 మంది నిందితులను కూడా ఈడీ విచారించనున్నట్లు సమాచారం. డ్రగ్ కేసులో మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లు ఈడీ గుర్తించింది. డ్రగ్స్ కోసం విదేశాలకు భారీ మొత్తంలో నగదు తరలించినట్లు కనుగొన్నారు.
![]() |
![]() |