![]() |
![]() |

"మనుషుల్లో అనేక రకాల అభద్రతా భావాలు ఉంటాయనీ, బట్టతల ఉండటంతో అభద్రతా భావానికి గురైన ఓ వ్యక్తి కథ 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమా" అని డైరెక్టర్ క్రిష్ చెప్పారు. తనకు బట్టతల ఉండటం వల్ల ఈ సినిమా కథకు బాగా కనెక్టయ్యానని ఆయన అన్నారు. అవసరాల శ్రీనివాస్ టైటిల్ రోల్ చేసిన సినిమా '101 జిల్లాల అందగాడు'. 'హిట్' ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. క్రిష్ సమర్పిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 3న రిలీజవుతోంది.
రీసెంట్‌గా జరిగిన ఆ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన క్రిష్, తాను 'కంచె' సినిమాని డైరెక్ట్ చేస్తున్న సమయంలో అవసరాల శ్రీనివాస్ ఈ కాన్సెప్ట్ చెప్పాడని గుర్తు చేసుకున్నారు. మనుషులు తమలోని అభద్రతా భావాల వల్ల జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటుంటారని, దాన్ని హిలేరియస్‌గా చూపిస్తానంటూ ఈ కథ చెప్పాడన్నారు. "అప్పుడు నాకు జుట్టు ఊడిపోతూ బట్టతల వస్తుండటంతో ఆ స్టోరీ నాకు బాగా రీచ్ అయింది" అని నవ్వుతూ చెప్పారు క్రిష్.
"ఈ సినిమా షూటింగ్‌లో బట్టతల కోసం విగ్గు చేపిద్దాం, కొలతలు కావాలని అడిగితే, లేదు నేను జుట్టు తీయించుకుంటానని చెప్పి, ఐదు నెలల పాటు జుట్టు షేవ్ చేయించుకుంటూ అవసరాల శ్రీనివాస్ బట్టతల మెయిన్‌టైన్ చేశాడు. అతనికి హ్యాట్సాఫ్" అని ఆయన ప్రశంసించారు. 2015లో అవసరాల చెప్పిన కథ 2021లో బయటకు వస్తోందన్నారు.
![]() |
![]() |