![]() |
![]() |

పూజా హెగ్డే తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌పై, ఆమెకు టాలీవుడ్ నిర్మాతలు కల్పిస్తున్న సౌకర్యాలపై నిర్మాత నట్టి కుమార్ ఫైర్ అయ్యారు. ఇండస్ట్రీని పాడు చేస్తున్నారంటూ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న సౌందర్య కాలానికీ, ఇప్పటి కాలానికీ ముడిపెట్టి పూజా హెగ్డేని ఏకిపారేశారు. సౌందర్య 25 లక్షల నుంచి 30 లక్షలు పారితోషికం తీసుకున్నారనీ, అది హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అనీ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
నిన్న కాక మొన్న వచ్చినవాళ్లు, ఒక సినిమా చేసిన అమ్మాయిలకు 2 కోట్లు, 3 కోట్లు ఇస్తున్నారని నట్టి కుమార్ దుయ్యబట్టారు. 3 కోట్లు తీసుకుంటున్న హీరోయిన్ వెనుక నలుగురు బాడీగార్డులు ఉంటున్నారనీ, ఆ హీరోయిన్ల కోసం చార్టర్డ్ ఫ్లైట్లు కూడా వేసే రోజు వచ్చిందనీ విమర్శించారు. ప్రజల డబ్బును ఇలా విచ్చలవిడిగా ఖర్చుపెట్టేస్తున్నారని ఆయన అన్నారు. హీరోయిన్‌కే కాకుండా ఆమె అసిస్టెంట్‌కు కూడా కారవాన్ పెడుతున్నారని ఆయన ఆరోపించారు. నిర్మాతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండటం వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆయన దుయ్యబట్టారు.
ఆయన ఈ విమర్శలు చేసిందీ, ఆగ్రహం వ్యక్తం చేసిందీ పూజా హెగ్డే తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌పై, ఆమెతో పాటు షూటింగ్ లొకేషన్‌కు వస్తున్న మందీ మార్బలంపై. ఆమెతో వస్తున్న వారందరి ఖర్చుల్ని కూడా నిర్మాతే భరించాల్సి వస్తోందని ఆయన నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
![]() |
![]() |