![]() |
![]() |

సెంటిమెంట్ సినిమాలకు చిరునామాగా నిలిచిన దర్శకుల్లో ముత్యాల సుబ్బయ్య ఒకరు. దర్శకరత్న దాసరి నారాయణరావు టైటిల్ రోల్ లో ఆయన రూపొందించిన `మామగారు` కూడా ఈ తరహా చిత్రమే. తమిళ సినిమా `నాన్ పుడిచ్చ మాప్పిళ్ళై` (నిళల్ గళ్ రవి, శరణ్య, ఐశ్వర్య, జనకరాజ్) ఆధారంగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వినోద్ కుమార్, యమున, ఐశ్వర్య, అన్నపూర్ణ, నిర్మలమ్మ, కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. నటుడిగా విశ్వరూపం ప్రదర్శించడమే కాకుండా.. `ఉత్తమ నటుడు`గా ఈ సినిమాతో `నంది` పురస్కారం కూడా అందుకున్నారు దాసరి. ఇక ఇదే చిత్రానికి గానూ `ఉత్తమ సహాయ నటుడు`గా వినోద్ కుమార్, `ఉత్తమ హాస్య నటుడు`గా బాబూ మోహన్ కూడా నంది అవార్డ్స్ సొంతం చేసుకున్నారు.
రాజ్ - కోటి సంగీతసారథ్యంలో రూపొందిన పాటల్లో ``శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే``, ``ఈనాడే అచ్చమైన దీపావళి``, ``ఈ రాతిరి శివరాతిరి`` ప్రజాదరణ పొందాయి. ఎం.ఎం. మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎడిటర్ మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి తోటపల్లి మధు అందించిన సంభాషణలు ప్రధాన బలంగా నిలిచాయి. 1991 ఆగస్టు 30న విడుదలై అఖండ విజయం సాధించిన `మామగారు`.. నేటితో 30 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |