![]() |
![]() |

రాజమౌళి 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' ఏ రేంజ్‌లో కలెక్షన్లు సాధిస్తుంది?.. ఇది ఇప్పుడు చాలామంది సినిమా ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం. రాజమౌళి విషయం పక్కనపెడితే, ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్.. ఇప్పటికే రెండున్నరేళ్లు వెచ్చించారు. జూనియర్ ఎన్టీఆర్ మునుపటి సినిమా 'అరవింద సమేత' 2018 అక్టోబర్‌లో వచ్చింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తారక్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఆ మూవీ తర్వాత ఆయన వేరే సినిమా ఏదీ ఒప్పుకోకుండా రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'కు కమిటయ్యాడు.
ఆ సినిమా చేసేటప్పుడు వేరే సినిమా ఏదీ చేయకూడదనే రాజమౌళి కండిషన్‌తో రెండున్నరేళ్ల నుంచీ దానికే సమయాన్నంతా వెచ్చించాడు. ఇన్నాళ్లకు ఉక్రెయిన్‌లో చేసిన చివరి షెడ్యూల్‌తో ఆ సినిమా పూర్తిచేశాడు. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షోతో టీవీ వ్యూయర్స్ ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ఆయన కొరటాల శివ డైరెక్షన్‌లో నటించనున్నాడు. అయితే కొరటాల ఖాళీగా లేడు. చిరంజీవి - రామ్‌చరణ్‌తో చేస్తున్న 'ఆచార్య' మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అదయ్యాక, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ చేశాక.. అప్పుడు తారక్‌ను డైరెక్ట్ చేయడానికి ఆయనకు వీలవుతుంది. ఈ లెక్కన ఈ ఏడాది తారక్ - కొరటాల కాంబో మూవీ సెట్స్ మీదకు వెళ్లడం అనుమానమే.
మరోవైపు రామ్‌చరణ్ మునుపటి సినిమా 'వినయ విధేయరామ' 2019 జనవరిలో వచ్చింది. అంటే ఇప్పటికే రెండున్నరేళ్లు దాటిపోయాయి. అప్పట్నుంచీ డెడికేటెడ్‌గా 'ఆర్ఆర్ఆర్'కు పనిచేస్తూ వచ్చాడు. తండ్రితో తీస్తున్న సొంత సినిమా 'ఆచార్య' షూటింగ్ ఆలస్యం కావడానికి కారణం.. చరణ్ సకాలంలో ఆ సినిమా సెట్స్ మీదకు రాకపోవడమే. 'ఆర్ఆర్ఆర్' కోసం ఎప్పుడు డేట్స్ ఇవ్వాల్సి ఉంటుందో తెలీదు కాబట్టి, 'ఆచార్య'లో తన పోర్షన్ పూర్తి చేయడానికి ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ ఫినిష్ అవడంతో ఇప్పుడాయన 'ఆచార్య' ప్రొడక్షన్‌పై పూర్తిగా నిమగ్నమయ్యాడు. ఏదేమైనా 'ఆచార్య' అనేది చిరంజీవి మూవీ కానీ చరణ్ మూవీ కాదు. అందులో చరణ్‌ది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు.
'ఆర్ఆర్ఆర్' మూవీని అక్టోబర్ 13న దసరా సెలవుల్లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ అయితే చేశారు కానీ, అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యే చాన్స్ లేదనేది గట్టిగా వినిపిస్తున్న విషయం. 2022 సమ్మర్‌కు అది పోస్ట్‌పోన్ కావచ్చని ఇండస్ట్రీ వర్గాలు నమ్ముతున్నాయి. అదే జరిగితే జూనియర్ ఎన్టీఆర్ వరుసగా మూడేళ్లు జీరో రిలీజ్‌లు ఉన్న స్టార్ అయితే, రామ్‌చరణ్ రెండేళ్లు జీరో రిలీజ్‌లు ఉన్న స్టార్ అవుతాడు. ప్రభాస్‌కు వచ్చిన గ్యాప్ 'బాహుబలి' బ్లాక్‌బస్టర్ కావడంతో ఊరటనిచ్చింది. అదే తరహాలో 'ఆర్ఆర్ఆర్' బ్లాక్‌బస్టర్ అయితేనే తారక్, చరణ్‌లకు ఊరట లభిస్తుంది. లేదంటే ఇన్నేళ్లు పడ్డ కష్టానికి ఫలితం లభించలేదనే బాధ కొంతకాలం పాటు వెన్నాడక మానదు. అలా కాకూడదనే కోరుకుందాం...
![]() |
![]() |