![]() |
![]() |

వైవిధ్యభరితమైన చిత్రాలకు పెట్టింది పేరు.. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. అదే బాటలో పయనించిన నిర్మాణ సంస్థ.. ఉషాకిరణ్ మూవీస్. అలాంటి సింగీతం - ఉషాకిరణ్ మూవీస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం `మయూరి` (1985) మెమరబుల్ మూవీగా నిలవగా.. సరిగ్గా పదహారేళ్ళ తరువాత తెలుగునాట వీరి కలయికలో వచ్చిన మరో సినిమా `ఆకాశ వీధిలో`. స్నేహం, ప్రేమ, కుటుంబ బంధాలు, తీవ్రవాదం.. ఇలా ఎన్నో అంశాల చుట్టూ అల్లుకున్న చిత్రమిది. ఇందులో కింగ్ నాగార్జున పైలెట్ గా నటించగా.. ఆయనకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కనువిందు చేసింది.
నటకిరీటి రాజేంద్రప్రసాద్, కస్తూరి, రాహుల్ దేవ్, కోట శ్రీనివాసరావు, సుధాకర్, గిరిబాబు, మల్లికార్జునరావు, చలపతిరావు, ఏవీయస్, శ్రీలక్ష్మి, రజిత, మాస్టర్ తేజ (ద్విపాత్రాభినయం) ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి ఎస్. గోపాల్ రెడ్డి అందించిన ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
స్వరవాణి కీరవాణి సంగీతమందించిన ఈ చిత్రంలో టైటిల్ సాంగ్ గా వచ్చే ``వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే..`` (చంద్రబోస్ సాహిత్యం - దేవి శ్రీ ప్రసాద్, గంగ గానం) విశేషాదరణ పొందింది. 2001 ఆగస్టు 23న విడుదలైన `ఆకాశ వీధిలో`.. నేటితో 20 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |