![]() |
![]() |

ప్రేమకథా చిత్రాలకు చిరునామాగా నిలిచిన దర్శకుల్లో కదిర్ ఒకరు. `ఇదయం` (తెలుగులో `హృదయం`) (1991)తో తొలిసారి మెగాఫోన్ పట్టిన ఈ కోలీవుడ్ కెప్టెన్.. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించారు. ఇక ఆయన దర్శకత్వంలో రూపొందిన మూడో చిత్రం `కాదల్ దేశమ్` అయితే యువతరాన్ని ఉర్రూతలూగించింది. ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా.. తెలుగులో `ప్రేమ దేశం`గా అనువాదమై ఇక్కడి ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించింది.
ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు స్నేహితులు.. చివరకు ఆమె ప్రేమను పొందారా? లేదా? అనేది `ప్రేమ దేశం` చిత్రంలోని మెయిన్ పాయింట్. రెగ్యులర్ లవ్ స్టోరీస్ కి భిన్నంగా ఈ సినిమాకి ఇచ్చిన ముగింపు.. అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇద్దరు మిత్రులుగా అబ్బాస్, వినీత్ నటించగా.. ఆ యువతి పాత్రలో టబు కనిపించింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం, శ్రీవిద్య, వడివేలు, చిన్ని జయంత్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
ఎ.ఆర్. రెహమాన్ స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా ``ముస్తఫా ముస్తఫా`` ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలవగా.. ``ప్రేమా ప్రేమా``, ``కాలేజి స్టైలే``, ``హల్లో డాక్టర్``, ``వెన్నెలా`` గీతాలు కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. 1996 ఆగస్టు 23న విడుదలై తమిళ, తెలుగు భాషల్లో అఖండ విజయం సాధించిన ఈ మ్యూజికల్ సెన్సేషన్.. నేటితో పాతికేళ్ళు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |