![]() |
![]() |

హీరో కార్తికేయ గుమ్మకొండ జీవితంలో స్థిరపడేందుకు సిద్ధమవుతున్నాడు. మీడియా ప్రచారానికి దూరంగా తన జీవిత భాగస్వామి కాబోతున్న అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. రాఖీ పూర్ణిమ పర్వదినాన సంప్రదాయ బద్ధంగా కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల సమక్షంలో నిరాడంబరంగా ఈ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఆ ఫొటోలో కార్తికేయ నవ్వుతూ చాలా ఆనందంగా కనిపిస్తున్నాడు. చడీచప్పుడు లేకుండా అతను నిశ్చితార్ధం చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
గమనించదగ్గ అంశమేమంటే కార్తికేయ తన ఫేవరేట్ యాక్టర్ చిరంజీవి పుట్టినరోజున నిశ్చితార్ధం చేసుకోవడం. గతంలో చిరంజీవికి తను వీరాభిమానినని సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూ, ఆయన పాటలకు డాన్స్ చేస్తూ వచ్చాడు కార్తికేయ. వధువు ఎవరు, ఆమె పేరేమిటనేది ఇంతదాకా వెల్లడి కాలేదు. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమని తెలిసింది. త్వరలో తన పెళ్లికి సంబంధించి కార్తికేయ అఫిషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతం కార్తికేయ 'రాజా విక్రమార్క' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని కొత్త దర్శకుడు శ్రీ సారిపల్లి రూపొందిస్తున్నాడు. అలాగే తమిళంలో అజిత్ సినిమా 'వాలిమై'లో విలన్‌గా నటిస్తున్నాడు.
![]() |
![]() |