![]() |
![]() |

సుధీర్‌బాబు, ఆనంది జంటగా నటించిన 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా విడుదల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ, నిర్మాతలు గురువారం ఆ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. సూపర్‌స్టార్ మహేశ్ ఈ ట్రైలర్‌లను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేయడం ద్వారా ఆవిష్కరించారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని రూపొందినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. సుధీర్ లైటింగ్ సూరిబాబుగా, ఆనంది సోడాల శ్రీదేవిగా ఈ సినిమాలో కనిపించనున్నారు. సూరిబాబు, శ్రీదేవి ప్రేమలోపడి, ఆ తర్వాత శ్రీదేవి తండ్రి (నరేశ్) కంట్లో పడతారు. "సూరిబాబు మంచోడు నాన్నా" అని ఇంటి దగ్గర శ్రీదేవి చెప్తే, "మంచోడే కానీ మనోడు కాదుగా" అంటాడు తండ్రి. అదిగదీ.. వాళ్ల పెళ్లికి అడ్డు కులమయ్యిందన్న మాట.
ఆ ప్రేమికుల్ని విడదీయడానికి లోకల్ పొలిటీషియన్‌తో చేతులు కలుపుతాడు శ్రీదేవి తండ్రి. ఏదో కేసులో సూరిబాబును ఇరికించి జైలుకు పంపుతారు. అతను జైలు నుంచి బయటకు వచ్చే లోగా శ్రీదేవికి మరొకరితో పెళ్లయినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. చివరలో అజయ్ మెడను ఒడిసి పట్టుకొని, "శ్రీదేవి నాది, ఎప్పటికీ నాదే" అని సూరిబాబు కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్‌గా చెప్పడం చూస్తుంటే.. కుర్చీలో మునివేళ్లపై కూర్చోపెట్టే థ్రిల్లింగ్స్, ఎమోషన్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని అనిపిస్తోంది.
తొలి సినిమా 'పలాస 1978'తోటే డైరెక్టర్‌గా అందరి ప్రశంసలూ అందుకున్న కరుణకుమార్ ఇప్పుడు 'శ్రీదేవి సోడా సెంటర్' అనే యాక్షన్ మేళవించిన రొమాంటిక్ ఫిల్మ్‌ను మనకు అందిస్తున్నాడు. సూరిబాబు, శ్రీదేవి పాత్రల్లో సుధీర్‌బాబు, ఆనంది పర్ఫార్మెన్స్ ఆడియెన్స్‌ను అలరించడం ఖాయమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సూరిబాబు, శ్రీదేవిలను విడగొట్టడంలో ప్రధాన పాత్ర పోషించే లోకల్ పొలిటీషియన్ క్యారెక్టర్‌లో తమిళ యాక్టర్ పావెల్ నవగీతన్ కనిపించే ఈ సినిమాలో నరేశ్, అజయ్, రఘుబాబు, హర్షవర్ధన్, సత్యం రాజేశ్, సప్తగిరి, రోహిణి, స్నేహా గుప్తా సపోర్టింగ్ రోల్స్ చేశారు.
మణిశర్మ మ్యూజిక్ అందించిన పాటలు ఇప్పటికే సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. షాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్‌గా, ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేసిన ఈ మూవీని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 27న 'శ్రీదేవి సోడా సెంటర్' ప్రేక్షకుల ముందుకు రానున్నది.
![]() |
![]() |