![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ విజయం సాధించాలని కోరుకుంటూ పల్లి రంజిత్ కుమార్ అనే అభిమాని రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర ప్రారంభించాడు. రంజిత్ కుమార్ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంటాడు. రాజమండ్రి రూరల్‌లోని కోలమూరు గ్రామానికి చెందిన రంజిత్ అక్కడ్నుంచి హైదరాబాద్‌కు 485 కిలో మీటర్ల దూరం పాదయాత్ర తలపెట్టాడు. నాలుగు రోజుల్లో హైదరాబాద్‌కు చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ప్రకాశ్‌రాజ్ మంచితనం, ఆయన సేవా కార్యక్రమాలు, మహబూబ్‌నగర్‌లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం లాంటి అంశాలు తనను బాగా మోటివేట్ చేశాయని, అందుకే ఆయనకు అభిమానిగా మారానని రంజిత్ తెలిపాడు. లోకల్-నాన్ లోకల్ అంటూ తేడాలు తీసుకువచ్చి, ప్రకాశ్‌రాజ్‌ను నాన్ లోకల్‌గా కొంతమంది ప్రస్తావిస్తుండటం తప్పని అతను చెప్పాడు. నటింపచేయడానికి, మాలో సభ్యత్వం ఇవ్వడానికి లేని నాన్ లోకల్ ఇష్యూ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తుంటే ఎందుకు తీసుకువస్తున్నారని అతను ప్రశ్నించాడు.
అయితే రంజిత్ పాదయాత్ర విషయం తెలిసిన ప్రకాశ్‌రాజ్ అతనితో ఫోన్‌లో మాట్లాడారు. అతని అభిమానానికి ధన్యవాదాలు చెప్తూనే, అలా పాదయాత్ర చేయవద్దనీ, తిరిగి ఇంటికి వెళ్లిపొమ్మనీ చెప్పారు. త్వరలో అతడిని వ్యక్తిగతంగా కలుస్తానని హామీ ఇచ్చారు. ప్రకాశ్‌రాజ్ మాటకు విలువనిచ్చి రంజిత్ వెనక్కి మళ్లాడు.
ఈ విషయాన్ని ప్రకాశ్‌రాజ్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. "రంజిత్ బంగారం.. నిస్వార్థం తో కూడిన మీలాంటి వారి అభిమానమే కళాకారుడిగా నన్ను ముందుకు నడిపిస్తోంది. మీ ప్రయత్నం నా మనసుకు బాధ కలిగిస్తోంది. నా మాటగా తిరిగి మీరు ఇంటికి వెళ్లి ఆనందంగా ఉండండి. త్వరలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలసి మాట్లాడతాను. నా మాట విన్నందుకు సంతోషంగా ఉంది." అని ఆయన ట్వీట్ చేశారు.
.jpg)
ఇటీవల కింద పడటంతో చేతికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్న ఆయన, చేతికి కట్టుతోటే రెండు రోజుల క్రితం గ్వాలియర్‌కు వెళ్లారు. అక్కడ మణిరత్నం మూవీ 'పొన్నియన్ సెల్వన్' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
![]() |
![]() |