![]() |
![]() |
విక్టరీ వెంకటేశ్‌కు యువ హీరో శ్రీవిష్ణు వీరాభిమాని. రీసెంట్‌గా ‘రాజ రాజ చోర’ వెంకటేశ్ క్లాసిక్ సినిమాల్లా ఉంటుందని ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌లో చెప్పాడు. అంతే కాదు, ఆ తర్వాత అభిమాన హీరోను కలిసి మాట్లాడాడు కూడా! అప్పుడు వెంకటేశ్ తనకు ఓ సలహా ఇచ్చారని, వెంకీతో కలిసి క్షణాలను శ్రీవిష్ణు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
‘‘వైజాగ్‌లో ఉన్నప్పుడు వెంకటేశ్‌గారి కటౌట్లు కట్టాను. ఆయన ఫంక్షన్లకు వెళ్లాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన్ను కలిసే అవకాశం వచ్చింది. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘మెంటల్ మదిలో’ వంటి చిత్రాలను సురేశ్‌బాబుగారి భాగస్వామ్యంలో చేశాం. ఆయన ద్వారా వెళ్లి వెంకటేశ్‌గారిని కలిసే వీలు ఉంది. కానీ, నేను అలా చెయ్యలేదు. మనకంటూ ఓ పేరొచ్చిన తర్వాత కలవాలని అనుకున్నా. అలాగే, జరిగింది. ‘నీదీ నాదీ ఒకే కథ’ తర్వాత వెంకటేశ్‌గారు పిలిచి మాట్లాడారు. అప్పట్నుంచీ టచ్‌లో ఉంటున్నా. నేను చేస్తున్న సినిమాల గురించి చెబుతుంటా. ‘రాజ రాజ చోర’ ట్రైలర్ విడుదలైన రెండు నిమిషాలకు ఆయన్నుంచి మెస్సేజ్ వచ్చింది. బావుందన్నారు. ఇటీవల మళ్లీ కలిశా. మాస్ జానర్‌లో డిఫరెంట్ సినిమాలు ట్రై చెయ్యమన్నారు. నేను కూడా నెక్ట్స్ సినిమాలను రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ప్లాన్ చేశా. మాస్ అంటే వందమందిని కొట్టేలా కాకుండా, మాస్ టచ్‌తో కొత్తగా ఉండేలా చేస్తున్నా’’ అని శ్రీవిష్ణు చెప్పారు.
‘రాజ రాజ చోర’లో కొంటె దొంగగా కనిపిస్తానని, ఈ సినిమా తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుందని శ్రీవిష్ణు చెప్పారు. కథ గురించి ఎక్కువ రివీల్ చెయ్యలేనన్నారు. అయితే, ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌లో ఏదీ ఎక్కువగా మాట్లాడలేదన్నారు. సినిమా రిలీజ్ తర్వాత వివేక్ సాగర్ సంగీతం గురించి ఎక్కువ మాట్లాడుకుంటారని ఆయన తెలిపారు. కొత్త దర్శకులతో చేసిన సినిమాలతో ఎక్కువశాతం విజయాలు అందుకున్నారని మీడియా చెప్పగా, అవునని అంగీకరించారు.
![]() |
![]() |