![]() |
![]() |

తెలుగు సినిమా ఇండస్ట్రీలో థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన సమస్యలు వచ్చిన ప్రతిసారీ 'ఆ నలుగురు' అంటూ ఎక్కువమంది విమర్శల బాణాలు ఎక్కుపెడుతూ ఉంటారు. థియేటర్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం చేస్తున్న ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, 'ఏషియన్' సునీల్ నారంగ్ తమకు థియేటర్లు ఇవ్వడం లేదని, రిలీజుల విషయంలో ఆ నలుగురు తెలుగు పరిశ్రమను శాసిస్తున్నారని కొందరు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ నలుగురిని మెగాస్టార్ చిరంజీవి హెచ్చరించారని ఒక ఆంగ్ల పత్రిక పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నుండి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా పరిశ్రమలో సమస్యలను చర్చించడానికి ఆగస్టు చివరి వారంలో రమ్మని చెప్పారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ ప్రముఖులను చిరంజీవి ఇంటికి ఆహ్వానించారు. జగన్ దగ్గర ఏయే విషయాలు మాట్లాడాలని సమాలోచనలు జరిపారు. ఆ సమయంలో డిస్ట్రిబ్యూటర్ల నుండి వర్చువల్ ఫీజ్ వసూలు విషయమై ఆ నలుగురికి చిరంజీవి హెచ్చరికలు జారీ చేశారట.
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు పాతిక నుండి ముప్పై వేల వరకూ వీపీఎఫ్ వర్చువల్ ప్రింట్ ఫీజ్ వసూలు చేస్తున్నారు. థియేటర్లను లీజుకు లేదా అద్దెకు తీసుకుని నడిపిస్తున్న దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్, సునీల్ నారంగ్... ఆ ఫీజును డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుండి తీసుకుంటున్నారు. అలా చెయ్యవద్దని, థియేటర్ ఓనర్ల నుండి తీసుకోవాలని ఆ నలుగురికి చిరంజీవి చెప్పారట. అందుకు, దిల్ రాజు, అల్లు అరవింద్ అంగీకరించగా... వారంలో తమ అభిప్రాయం చెబుతామని సురేష్ బాబు, సునీల్ నారంగ్ చెప్పారట. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేస్తుంటే ప్రేక్షకుల నుండి అదనంగా వసూలు చేస్తున్న 30 రూపాయలు డిస్ట్రిబ్యూటర్లకు వస్తున్నాయా లేదా అని కూడా చిరంజీవి ప్రశ్నించారట.
![]() |
![]() |