![]() |
![]() |

సుధీర్‌బాబు, ఆనంది జంటగా రూపొందుతోన్న చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. 'పలాస 1978' మూవీతో డైరెక్టర్‌గా పరిచయమై అందరి దృష్టినీ ఆకట్టుకున్న కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలోని "చుక్కల మేళం దిక్కుల తాళం ఒక్కటయే ఈ సంబరం.." అంటూ సాగే పాట మంగళవారం (ఆగస్ట్ 17) విడుదలైంది. ఓ పెళ్లి సంబరంలో ఖవ్వాలీ తరహాలో సాగిన ఈ పాట ఆకట్టుకొనేలా ఉంది. ఒక పెళ్లి వేడుకకు హీరో హీరోయిన్లు, ఇతర ప్రధాన పాత్రధారులు వచ్చినప్పుడు ఈ పాట వస్తున్నట్లు చూపించారు. మధ్యలో హీరోయిన్‌ను చూస్తూ హీరో ఇమాజినేషన్‌లోకి వెళ్లిపోయినట్లు, చిన్నపిల్లల మధ్య తాము పెళ్లిచేసుకున్నట్లు ఊహించుకున్నట్లు కనిపించింది.
మణిశర్మ స్వరాలు కూర్చిన ఈ పాటను చక్కని సాహిత్యంతో కల్యాణ్ చక్రవర్తి రాయగా, అనురాగ్ కులకర్ణి రాగయుక్తంగా ఆలపించాడు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ సమకూర్చాడు. "బతుకు పదుగురితో అతుకు పడినదనీ.. నడక నలుగురితో కలిసి నడవమనీ.. ఉన్నతంగా చూడరా మరి ఉన్నదే స్నేహం.. నమ్మకంగా సాగరా కడదాకా ఓ నేస్తం" అనే పాదాలు జీవితంలో ఎలా నడవాలో తెలియజేస్తున్నాయి. సుధీర్‌బాబు, ఆనంది మధ్య కెమిస్ట్రీ చూడముచ్చటగా అనిపిస్తోంది.
పావెల్ నవగీతన్, నరేశ్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేశ్, హర్షవర్ధన్, సప్తగిరి, కల్యాణి రాజు, రోహిణి తారాగణమైన ఈ చిత్రానికి షామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్‌గా, ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు కరుణ కుమార్ రచన కూడా చేశాడు. త్వరలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
![]() |
![]() |