![]() |
![]() |

తెలంగాణలో వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. టిక్కెట్ రేట్ల నిర్ణయంపై నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చింది. దాంతో పెద్ద సినిమా విడుదలైతే, మొదటి రెండు వారాల పాటు టిక్కెట్ రేట్లను పెంచుతూ భారీ వసూళ్లను పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోటే నడుస్తున్నాయి. అయినప్పటికీ ఇది తమకు వర్కవుట్ కాదని పలువురు ఎగ్జిబిటర్లు థియేటర్లను తెరవలేదు. పైగా అక్కడ మునుపటి టిక్కెట్ రేట్లతో పోలిస్తే ఇప్పటి టిక్కెట్ రేట్లు తగ్గాయి. దీంతో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు వెనుకాడుతున్నారు.
అందువల్ల ప్రస్తుతం చిన్న సినిమాలే విడుదలవుతున్నాయి. పెద్ద సినిమాలేవీ విడుదల కావట్లేదు. నాగచైతన్య-సాయిపల్లవి 'లవ్ స్టోరి', నాని 'టక్ జగదీష్' సినిమాలు ఎప్పుడో పూర్తయి విడుదలకు రెడీగా ఉన్నప్పటికీ వాటిని రిలీజ్ చేయట్లేదు. పరిస్థితిని బట్టి 'టక్ జగదీష్'ను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఇప్పటికే నిర్మాతలు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. లవ్ స్టోరి విషయంలో మరికొన్ని రోజులు వేచి చూద్దామని నిర్ణయించుకున్నారు నిర్మాతలు.
ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి నుంచి చిరంజీవికి ఆహ్వానం అందింది. దీంతో జగన్‌తో ఏం మాట్లాడాలో, ఏయే అంశాలు-సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లాలో అనే అంశంపై సోమవారం పలువురు సినీ ప్రముఖులతో చిరంజీవి ఓ భేటీ నిర్వహించారు. అందులో చర్చించిన అంశాలను క్రోడీకరించి వాటిని జగన్‌తో ప్రస్తావించాలని చిరంజీవి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈరోజు జిమ్‌లో చిరంజీవిని కలిశారు ప్రకాశ్‌రాజ్. రానున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షునిగా పోటీలో ఉన్నారు ప్రకాశ్‌రాజ్. ఆయనకు చిరంజీవి ఫుల్ సపోర్ట్ ఉందనే విషయం ప్రచారంలో ఉంది.
ఇటీవల ప్రకాశ్‌రాజ్‌కు కిందపడటంతో భుజానికి గాయమైంది. హైదరాబాద్‌లో సర్జరీ చేయించుకున్నారు. చేతికి కట్టుతోటే జిమ్‌కు వెళ్లిన ఆయన అక్కడ చిరంజీవిని కలిశారు. దానికి సంబంధించిన ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. "జిమ్‌లో 'బాస్'తో వేకువ జామున మీటింగ్. సినిమావాళ్ల సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు ముందడుగు వేసినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పాను. 'అన్నయ్య' ఎప్పుడూ ప్రేరణగా నిలుస్తుంటారు. ఆయనను కలిగివున్నందుకు మేం ధన్యులం." అని రాసుకొచ్చారు.

![]() |
![]() |