![]() |
![]() |

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 'ఇండియన్ ఐడల్ 12' గ్రాండ్ ఫినాలేలో విజేతగా ఉత్తరాఖండ్ సింగర్ పవన్‌దీప్ రాజన్ నిలిచాడు. ఫైనల్స్‌లో పవన్‌దీప్, అరుణిత కంజీలాల్, మొహమ్మద్ డానిష్, నిహాల్ టారో, సయాలీ కాంబ్లే, తెలుగుమ్మాయి షణ్ముఖప్రియ మధ్య నువ్వా నేనా అన్నట్లు జరిగిన పోటీలో అంతిమ విజయం పవన్‌దీప్‌కు దక్కింది. దేశవ్యాప్తంగా పేరుపొందిన ఈ రియాలిటీ షోలో స్టేజ్‌పైకి ఆరుగురు ఫైనలిస్టులు వచ్చినప్పుడు వీక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పాపులర్ సింగర్స్ ఉదిత్ నారాయణ్, సుఖ్విందర్ సింగ్, అల్కా యాజ్ఞిక్ పర్ఫార్మెన్స్ ఈ గ్రాండ్ ఫినాలేకు మరింత ఆకర్షణను తీసుకొచ్చింది.
తొమ్మది నెలలపాటు వీక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసి, అందరూ అత్యంత క్యూరియాసిటీతో ఎదురుచూసిన ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే 12 స్వాతంత్ర్య దినం నాడు ప్రసారమైంది. భారతీయ టెలివిజన్ చరిత్రలోనే ఒక నాన్-ఫిక్షన్ షో ఫైనల్ 12 గంటలపాటు టెలికాస్ట్ కావడం ఇదే మొట్టమొదటిసారి. ఈ షోలో షణ్ముఖప్రియ, అరుణిత కంజిలాల్, పవన్‌దీప్ రాజన్, మొహమ్మద్ డానిష్, నిహాల్ టారో, సయాలీ కాంబ్లే ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఇండియన్ ఐడల్ 12 ట్రోఫీని అందుకోవడానికి పలు హిట్ సాంగ్స్‌ను పాడుతూ, తమ టాలెంట్‌ను ప్రదర్శించారు సింగర్స్. 40కి పైగా ప్రదర్శనలతో ఈ గ్రాండ్ ఫినాలే వీక్షకుల్ని అలరించింది.
WWE మాజీ హెవీవెయిట్ చాంపియన్ ద గ్రేట్ కాళీ స్టేజి మీదకు వచ్చి మొహమ్మద్ డానిష్‌కు సపోర్ట్ చేశాడు. జడ్జిగా నేహా కక్కర్ బదులు వచ్చిన ఆమె సోదరి సోను కక్కర్ తన పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను అబ్బురపరచింది. ఈ షోలో మొదట్నుంచీ చివరి దాకా అందరి దృష్టినీ ఆకట్టుకొని, విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రశంసలు పొందిన షణ్ముఖప్రియ ఫైనల్స్‌లోనూ తనదైన స్టైల్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంతకు ముందు ఆమెకు హీరో విజయ్ దేవరకొండ తన సపోర్ట్‌ను తెలియజేస్తూ, బెస్ట్ విషెస్ అందించాడు.

చివరకు పవన్‌దీప్ రాజన్‌ను ఇండియన్ ఐడల్ 12 విజేతగా అనౌన్స్ చేశారు. అతను ఒక బ్రాండ్ న్యూ కారుతో పాటు రూ. 25 లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. ఫైనల్స్‌లో విజేతగా నిలవకపోయినా షణ్ముఖప్రియ కోట్లాదిమంది హృదయాలను గెలుచుకుంది. వీక్షకుల నుంచి ఆమెకు 40 శాతం ఓట్లు రావడం ఇందుకు నిదర్శనం.
![]() |
![]() |