![]() |
![]() |

ఇప్పటికే వివిధ పోటీలలో అవార్డులను అందుకున్న సురేష్ రాజ్ షార్ట్ ఫిల్మ్ 'దారి'కి అరుదైన గౌరవం దక్కింది. వికారాబాద్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కళాజాత బృందాలు 'దారి' షార్ట్ ఫిల్మ్‌ను ఊరూరా ప్రదర్శిస్తున్నారు. లేటెస్ట్‌గా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు ఊళ్లలో బహిరంగ ప్రదేశాల్లో తెరలు ఏర్పాటుచేసి ప్రదర్శిస్తున్నారు. మద్యపానం వల్ల కలిగే అనర్థాలు, పిల్లల చదువు ఆవశ్యకత వంటి అంశాలతో హృదయాన్ని హత్తుకొనే రీతిలో 'దారి' లఘు చిత్రాన్ని సురేష్ రాజ్ రూపొందించారు. అతనికి ఈ ఫిల్మ్ చాలా పేరు తీసుకొచ్చింది. నాణ్యమైన వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ నిర్మించడం ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న తెలుగువన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన బాలనటుడు భానుప్రకాశ్‌కు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. (ఈ షార్ట్ ఫిల్మ్ తర్వాత అతను పలు సినిమాల్లో నటించాడు. లేటెస్ట్ ఫిల్మ్ పాగల్‌లోనూ అతను నటించాడు.) అలాగే తాగుబోతు తండ్రిగా మోహన్ కూడా చక్కని నటన ప్రదర్శించారు. షార్ట్ ఫిలిమ్స్‌కు జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడంలో పేరుపొందిన 'క్లబ్బీ' నిర్వహించిన పోటీలో 'దారి'కి ప్రథమ బహుమతి లభించడం విశేషం.

మద్యానికి బానిసలైన వాళ్లు అనేకమంది తమ కుటుంబాలను నట్టేట ముంచుతున్నారు. పిల్లల ఆలనాపాలనా చూడకుండా, వారికి బడికి పంపకుండా పనుల్లోకి పంపుతున్నారు. అలాంటి వారిలో చైతన్యం కలిగించి, వారి జీవితాల్లో మార్పు తీసుకు రావడానికి పోలీసులు తమ కళాజాత బృందాల ద్వారా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా 'దారి' షార్ట్ ఫిల్మ్‌ను వారు ఊళ్లల్లో ప్రదర్శిస్తుండటం అభినందనీయం.
.jpg)

![]() |
![]() |