![]() |
![]() |
.jpg)
విక్టరీ వెంకటేశ్.. తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. తనకంటూ ఓ భారీ అభిమానగణాన్ని సొంతం చేసుకోవడమే కాదు.. ఇతర కథానాయకుల అభిమానుల్ని సైతం ఫిదా చేయగలగడం ఒక్క వెంకీకే చెల్లింది. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా విభిన్న పాత్రల్లో మురిపించి.. అటు మాస్, ఇటు క్లాస్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తూ, ఆబాలగోపాలాన్ని అలరిస్తూ ముందుకు సాగుతున్నారు ఈ దగ్గుబాటి వారి హ్యాండ్సమ్ హీరో. అలాంటి వెంకీ.. వెండితెరపై తొలి అడుగేసి నేటికి సరిగ్గా 35 ఏళ్ళు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నిర్దేశకత్వంలో రూపొందిన `కలియుగ పాండవులు` (1986 ఆగస్టు 14)తో వెంకీ కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు. ఇదే సినిమాతో అగ్ర కథానాయిక ఖుష్బూ కూడా తెలుగు తెరకు నాయికగా పరిచయమవ్వడం విశేషం. మొదటి ప్రయత్నంలోనే వెంకీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. `విక్టరీ`ని తన ఇంటిపేరు చేసుకున్నారు.
వెంకటేశ్ కి సంబంధించిన అరుదైన రికార్డ్ ఏంటంటే.. అప్పటివరకు స్టార్స్ కొడుకులే వారసత్వ బాటలో పయనించి స్టార్స్ అవుతూ వచ్చేవారు. వెంకీ మాత్రం అందుకు భిన్నంగా `నిర్మాత తనయుడు` అనే ట్యాగ్ తో ఎంట్రీ ఇచ్చి.. కాలక్రమంలో స్టార్ గా ఎదిగి అబ్బురపరిచారు. ఆ విషయంలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. మూవీమొఘల్ డి. రామానాయుడు కొడుకుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన వెంకటేశ్.. కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తూ అన్ని వర్గాల వారికి చేరువయ్యారు. ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారాయన. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజై వీక్షకాదరణ పొందిన `నారప్ప`తోనూ మరోసారి ఆ విషయాన్ని నిరూపించారు. మున్ముందు.. మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రలతో వెంకీ అలరించాలని ఆకాంక్షిద్దాం.
![]() |
![]() |