![]() |
![]() |

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు సినిమాలో ఆయన పేరు టైటిల్ పెట్టడం కొత్త ఏమీ కాదు. గతంలో జరిగాయి. 'బద్రి', 'గబ్బర్ సింగ్', 'బాలు', 'గుడుంబా శంకర్', 'కాటమరాయుడు' వంటి ఉదాహరణలు ఉన్నాయి. అయితే, పవన్ కల్యాణ్ ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ మాత్రం ఎప్పుడు అలా చెయ్యలేదు. 'జల్సా', 'అత్తారింటికి దారేది', 'అజ్ఞాతవాసి'... ఇలా కథకు అనుగుణంగా టైటిల్స్ పెట్టాడు. కానీ, ఈసారి పవన్ కల్యాణ్ స్టయిల్‌లోకి త్రివిక్రమ్ వచ్చారని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న సినిమాకు 'భీమ్లా నాయక్' టైటిల్ కన్ఫర్మ్ చేశారట. రేపు, ఆగస్టు 15 ఉదయం అదే టైటిల్ అనౌన్స్ చెయ్యబోతున్నారని సమాచారం. సినిమాలో పవన్ కల్యాణ్ క్యారెక్టర్ పేరు భీమ్లా నాయక్ అన్నది తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడు సాగర్ కె. చంద్ర అయినప్పటికీ, త్రివిక్రమ్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారని వినికిడి. స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించడంతో పాటు ఎక్కువసేపు సెట్ లో ఉంటున్నారు.
మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు ఇది రీమేక్. అందులో హీరోలు కలిసొచ్చేలా టైటిల్ పెట్టారు. తెలుగులో మాత్రం పవన్ మీద ఫోకస్ చేసినట్టు ఉన్నారు. మలయాళ సినిమాతో పోలిస్తే తెలుగులో పవన్ పాత్రకు కొన్ని మార్పులు చేశారని, నిడివి పెంచారని టాక్.
![]() |
![]() |