![]() |
![]() |

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్(మా) ఎన్నికలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇదే ఇప్పుడు నటి హేమకు క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసేలా చేసింది.
ప్రస్తుత 'మా' అధ్యక్షుడు నరేష్ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఇటీవల నటి హేమ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడిన వాయిస్ రికార్డ్ బయటపడింది. దీనిపై స్పందించిన నరేష్.. హేమ వ్యాఖ్యలను తప్పుపట్టారు. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే ఈ విషయం క్రమశిక్షణ సంఘం వద్దకు చేరింది. ఈ క్రమంలో క్రమశిక్షణ సంఘం హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని... లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది.
ఇదిలా ఉండగా.. మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారు చేసుకుంటున్న విమర్శలపై చిరంజీవి కూడా స్పందించారు. ఆయన 'మా' క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు. సభ్యుల బహిరంగ ప్రకటనతో 'మా' ప్రతిష్ఠ మసకబారుతుందని.. 'మా' ప్రతిష్ఠ దెబ్బతీస్తున్న ఎవర్నీ ఉపేక్షించవద్దని అన్నారు. మా ఎన్నికలను వెంటనే నిర్వహించాలని.. లేని పక్షంలో సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని లేఖలో పేర్కొన్నారు.
![]() |
![]() |