![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' మూవీ చేస్తున్నారు. దసరాకు ఈ సినిమా వస్తుందని ఊహిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' అక్టోబర్ 13న విడుదలవడం ఖాయమైతే, దానికి ఓ వారం ముందు కానీ, లేక, ఓ వారం తర్వాత కానీ విడుదల కావచ్చు. ఒకవేళ 'ఆర్ఆర్ఆర్' అక్టోబర్ 13న విడుదల కాకపోయినట్లయితే, ఆ డేట్‌కు 'ఆచార్య'ను తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
'ఆచార్య' మూవీ తర్వాత వరుసగా మూడు సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు చిరంజీవి. వెంటనే మలయాళం బ్లాక్‌బస్టర్ 'లూసిఫర్'కు రీమేక్ చేస్తున్న ఆయన, మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో ఒకటి, బాబీ డైరెక్షన్‌లో ఇంకొకటి చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వీరంతా చిరంజీవిని ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్న, చేయబోతున్నవాళ్లే. కానీ చిరంజీవితో 150వ సినిమా చేయడానికి కథను రెడీచేసి, భంగపడ్డ పూరి జగన్నాథ్‌కు మాత్రం చిరంజీవి నుంచి పిలుపు రాకపోవడం చాలామందిని బాధిస్తోంది. చిరు ఫ్యాన్స్ కూడా పూరి డైరెక్షన్‌లో తమ హీరో నటిస్తే చూడాలని తహతహ లాడుతున్నారు.
మెహర్ రమేశ్‌కు ఇంతదాకా సాలిడ్ హిట్ లేదు. బాబీకి తొలి సినిమా 'పవర్' తప్ప, తర్వాత తీసిన రెండు సినిమాలు ఊహించిన విధంగా ఆడలేదు. అలాంటి దర్శకులకు చాన్సులిచ్చిన మెగాస్టార్.. ఇప్పటికే పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను తీసిన, హీరోలను ఓ రేంజ్‌లో చూపించే, వాళ్లతో సూపర్బ్ డైలాగ్స్ పలికించే పూరి జగన్నాథ్‌కు చాన్స్ ఇవ్వకపోవడం ఏమిటని ఫ్యాన్స్ సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. పైగా రామ్‌చరణ్‌ను 'చిరుత'గా ఇంట్రడ్యూస్ చేసింది కూడా పూరినే కదా అని మాట్లాడుకుంటున్నారు.
చిరంజీవి కోసం రాసుకొన్న 'ఆటో జానీ' అనే కథను గతంలోనే ఆయనకు వినిపించాడు పూరి. మొదట ఫస్టాఫ్ చెప్పినప్పుడు చిరుకు నచ్చింది. తర్వాత సెకండాఫ్ వినిపించినప్పుడు తర్వాత మాట్లాడదాం అన్నారనీ, కథ నచ్చలేదని తనతో చెప్పలేదనీ పూరి చెప్పాడు. "ఆ విషయాన్ని ఆయనే మీడియా ముందుంచారు. కథలో కరెక్షన్లు చేద్దాం అని ఆయన అనుంటే నేను కూడా ఇంకో వెర్షన్ రాసేవాడ్ని." అని బాధపడ్డాడు పూరి.
ఇలా పూరి ఓపెన్ అవడం చిరంజీవికి నచ్చలేదనీ, అందుకే ఆయన నుంచి ఆ తర్వాత పూరికి పిలుపు రాలేదనీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. చిరుకు ఎవరైనా కష్టం కలిగిస్తే, వారినేమీ అనరు. కానీ మనసులో ఉంచుకుంటారనీ, వారిని ఆ తర్వాత దగ్గరకు చేరనీయరనీ పేరుంది. పూరి విషయంలోనూ ఆయన ఇదే ధోరణి అవలంబిస్తున్నారని అంటున్నారు. భవిష్యత్తులోనైనా చిరు మనసు మార్చుకొని పూరితో సినిమా చేస్తారా? చూద్దాం...
![]() |
![]() |