![]() |
![]() |
ఉత్తమనటిగా మూడు సార్లు జాతీయ నటి పురస్కారాన్ని అందుకున్న ఊర్వశి శారద కన్నుమూశారంటూ నేటి మధ్యాహ్నం ఒక వదంతి వాట్సప్ సర్కిల్స్‌లో చక్కర్లు కొట్టింది. కొంతమంది ఆ వదంతి నిజమేననుకుంటూ తమ వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశారు. క్షణాల్లో అది వైరల్‌గా మారింది. శారద అభిమానులు దిగ్భ్రాంతికి గురై, విషాదంలో మునిగిపోయారు.
శారద శ్రేయోభిలాషులు, మీడియా వ్యక్తులు శారదకు ఫోన్ చేయగా, ఆమె కులాసాగా ఉన్న విషయం స్పష్టమైంది. ఎవరో ఉబుసుపోని ఆకతాయి ఆ వదంతి పుట్టించారనీ తేలింది. తాను నిక్షేపంగా ఉన్నానని స్వయంగా శారద ఒక వాయిస్ మెసేజ్ ద్వారా తెలియజేశారు. ఎవరో వెధవ చేసిన పనికి చాలామంది తన అభిమానులు ఏడ్చారని ఆమె అన్నారు.
తన క్షేమసమాచారాన్ని తెలుసుకోవడానికి తన ఫోన్‌కు విపరీతంగా కాల్స్ వస్తున్నాయని శారద చెప్పారు. ఆమె ఆ వాయిస్ మెసేజ్‌లో ఏం చెప్పారంటే.. "అందరికీ నమస్కారం. నేను శారదని. నేను బాగానే ఉన్నాను. ఎవరో పాపం.. చాలామందిని బాధపెట్టారు. ఆడవాళ్లు, మగవాళ్లు (ఆ వదంతి విని) చాలా బాధపడ్డారు. అలాంటి పనులు చేయకూడదు. పనీపాటా లేనివాళ్లు ఏదైనా పని చూసుకోవాలి కానీ, ఈ పనికిమాలిని పనులు చేసి మనుషుల్ని బాధపెట్టడం చాలా తప్పు. ఇకనైనా పద్ధతి మార్చుకోండి." అని ఆమె వదంతులు పుట్టించినవారిని ఎండగట్టారు.
![]() |
![]() |