![]() |
![]() |

`ఇస్మార్ట్ శంకర్`తో మాస్ లో మాంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. అయితే, గత చిత్రం `రెడ్` ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో.. రాబోయే `రాపో 19`పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు ఈ పోతినేని పోరడు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి లింగుస్వామి దర్శకత్వం వహిస్తుండగా.. `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి నాయికగా నటిస్తోంది. ప్రముఖ నటి నదియా ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆమధ్య మాధవన్ పేరు వినిపించగా.. ఆ వార్తలకు ట్విట్టర్ లో చెక్ పెట్టారు మాధవన్. ఈ క్రమంలోనే.. ఇటీవల `వరుడు` విలన్, కోలీవుడ్ స్టార్ ఆర్య పేరు కూడా వినిపించింది. అయితే, దీనిపైనా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో.. మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. ఆ పేరే.. ఆది పినిశెట్టి. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్రవేసిన ఆది.. `సరైనోడు` సినిమాలో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే తమిళంలోనూ విభిన్న పాత్రలు పోషించి అలరించారు. తెలుగు, తమిళ భాషల్లో ఆదికి ఉన్న గుర్తింపు కారణంగానే.. `రాపో 19`లో తనని ప్రతినాయకుడిగా ఎంచుకున్నారని వినికిడి. త్వరలోనే రామ్ - లింగుస్వామి కాంబో మూవీలో ఆది పినిశెట్టి ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. రామ్ కి ఆది విలనిజం ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
![]() |
![]() |