![]() |
![]() |

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో `శ్రీమంతుడు` ఒకటి. కె. ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఏయన్నార్ కి జోడీగా జమున నటించారు. ఏయన్నార్ చిన్నప్పటి పాత్రలో మాస్టర్ ఆదినారాయణ కనిపించగా.. జమున చిన్నప్పటి వేషంలో బేబి శ్రీదేవి దర్శనమిచ్చారు. గుమ్మడి, రమణారెడ్డి, రాజబాబు, రావి కొండల రావు, సాక్షి రంగారావు, జె.ఎల్. నరసింహారావు, సూర్యకాంతం, ఝాన్సీ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
టి.చలపతిరావు సంగీతమందించిన ఈ చిత్రానికి సి. నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి, కొసరాజు సాహిత్యమందించారు. ``బులి బులి ఎర్రని బుగ్గలదానా``, ``చిట్టి పొట్టి బొమ్మలు`` పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలవగా.. ``మొదటి పెగ్గులో``, ``ఎంతో చిన్నది జీవితం``, ``ఆహా ఏమి అందం``, ``కొంటె చూపులు``, ``చల్లని వెన్నెలలో``, ``హరిలో రంగ హరి`` కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. విశ్వభారతి ప్రొడక్షన్స్ పతాకంపై జి. రాధాకృష్ణ మూర్తి, ఎ. రామచంద్రరావు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాకి డ్యాన్స్ అసిస్టెంట్ గా పనిచేయడం విశేషం. 1971 జూలై 16న విడుదలైన `శ్రీమంతుడు`.. అక్కినేని అభిమానుల ఆదరణ పొందింది. నేటితో ఈ మ్యూజికల్ హిట్ 50 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |