![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ ని టార్గెట్ చేస్తూ కొందరు నాన్ లోకల్ ప్రస్తావనను కూడా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటసింహం నందమూరి బాలకృష్ణ 'మా' ఎన్నికలపై స్పందించారు. లోకల్, నాన్ లోకల్ అనే విషయాలను తాను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు.
గతంలో 'మా'లో ఉన్నవాళ్లు ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అంటూ.. ఫస్ట్ క్లాస్ టికెట్లు వేసుకొని విమానాల్లో తిరిగారని.. ఆ డబ్బులను ఏం చేశారని బాలయ్య ప్రశ్నించారు. ఇంత వరకు 'మా'కు శాశ్వత భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోయారని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారా అని ఎద్దేవా చేశారు.
'మా' శాశ్వత భవన నిర్మాణానికి మంచు విష్ణు ముందుకొచ్చారనే విషయాన్ని ప్రస్తావించగా.. ఆ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామినవుతానని బాలయ్య చెప్పారు. అంతేకాదు, పరిశ్రమలో అందరూ కలిస్తే 'మా' కోసం మయసభ లాంటి అద్భుతమైన భవనాన్ని నిర్మించుకోవచ్చని అన్నారు. సినీ పరిశ్రమ అనేది గ్లామర్ ఫీల్డ్ అని... ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను బహిరంగ వేదికలపై చర్చించకూడదని బాలయ్య హితవు పలికారు.
![]() |
![]() |