![]() |
![]() |

దర్శకునిగా కోడి రామకృష్ణ ఎంతటి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారో మనకు తెలుసు. దాసరి నారాయణరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి, డైరెక్టర్‌గా ఎదిగి గురువుకు తగ్గ శిష్యుడనిపించుకున్నారు రామకృష్ణ. ఆయన దర్శకత్వంలో ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్ వచ్చాయి. టాలీవుడ్‌లో కంప్యూటర్ గ్రాఫిక్స్‌కు ఊపు తెచ్చిన డైరెక్టర్ కూడా ఆయనే. శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన రామకృష్ణ అనారోగ్యంతో 2019 ఫిబ్రవరిలో మృతి చెందారు.
కాగా ఇప్పుడు ఆయన పెద్ద కుమార్తె కోడి దివ్యదీప్తి సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. నిర్మాతగా మారి, 'కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్' అనే నిర్మాణ సంస్థను నెలకొల్పిన ఆమె, ఆ బ్యానర్‌పై తొలి సినిమాను ప్రకటించారు. అందులో కిరణ్ అబ్బవరం హీరోగా నటించనున్నాడు. 'రాజావారు రాణివారు'తో హీరోగా పరిచయమై ప్రామిసింగ్ యాక్టర్ అనిపించుకున్నాడు కిరణ్. జూలై 15 అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా అతనితో తన తొలి సినిమాను నిర్మించనున్నట్లు దివ్యదీప్తి ప్రకటించారు.
ఈ సినిమాతో కార్తీక్ శంకర్ దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మరో సినిమా 'ఎస్ఆర్ కల్యాణమంటపం' విడుదలకు రెడీ అవుతోంది. మరో రెండు సినిమాలు కూడా నిర్మాణంలో ఉన్నాయి.
![]() |
![]() |