![]() |
![]() |

మరాఠి మూవీ `సైరాట్`కి రీమేక్ వెర్షన్ గా రూపొందిన `ధడక్`(2018)తో హిందీనాట కథానాయికగా తొలి అడుగేసింది అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. మొదటి సినిమాతో నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకోవడమే కాకుండా ఓ విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది జాన్వి. ఆపై నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన `గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గాళ్`తో జాన్వీ నటిగా మరో మెట్టు ఎక్కింది. అయితే, మూడో సినిమాగా వచ్చిన `రూహీ` నిరాశపరిచింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జాన్వీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి `దోస్తానా 2` కాగా, మరొకటి `గుడ్ లక్ జెర్రీ`. వీటిలో `గుడ్ లక్ జెర్రీ`.. తమిళంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన `కోలమావు కోకిల` (తెలుగులో `కోకో కోకిల`)కి రీమేక్ వెర్షన్. త్వరలోనే ఈ బ్లాక్ కామెడీ డ్రామా జనం ముందుకు రానుంది. కాగా `ధడక్`, `గుడ్ లక్ జెర్రీ` తరువాత జాన్వీ మరో రీమేక్ లో యాక్ట్ చేయనుంది. ఆ సినిమానే.. మలయాళంలో మంచి విజయం సాధించిన `హెలెన్`. అన్నా బెన్ టైటిల్ రోల్ లో నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ని హిందీలో జాన్వీ తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మించనున్నారు.
ఆగస్టు నుంచి ఈ రీమేక్ పట్టాలెక్కనున్నట్లు టాక్. అంతేకాదు.. `మిలీ` అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు, మాతృకకి దర్శకత్వం వహించిన మతుకుట్టి గ్జేవియర్ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి.. ఈ రీమేక్ తో జాన్వీ ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.
![]() |
![]() |