![]() |
![]() |
.jpg)
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటిదాకా అధ్యక్షునిగా పోటీలో నిలుస్తున్న అభ్యర్థులు వార్తల్లో నిలవగా, ఇప్పుడు ఎన్నికల తేదీ వార్తల్లో నిలుస్తోంది. ఇంతదాకా సెప్టెంబర్‌లో మా ఎన్నికలు జరుగుతాయని వినిపించగా, ఇప్పుడు అవి మరింత కాలం వాయిదాపడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారమవుతోంది. వాస్తవానికి రెండేళ్లకోసారి 'మా' ఎన్నికలు జరగడం.. అదీ మార్చి నెలలో జరగడం ఆనవాయితీ. కరోనా మహమ్మారి కారణంగా ఈ మార్చి నెలలో ఎన్నికలు జరపడం వీలుకాలేదు. దాంతో ఏప్రిల్‌లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని ఓ లెటర్ రాశారు ప్రకాశ్‌రాజ్. 2019 లో ఆమోదించిన తీర్మానం ప్రకారం సెప్టెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని కమిటీ ఆయనకు సమాధానం ఇచ్చింది.
ఇది జరిగిన కొన్ని రోజులకే ప్రకాశ్‌రాజ్ తాను ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని ప్రకటించడమే కాకుండా, తన ప్యానెల్‌ను కూడా వెల్లడించారు. తాము కూడా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్లు మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, నటి హేమ ప్రకటించారు. దీంతో ఈసారి 'మా' ఎన్నికల ఘట్టం రసవత్తరంగా మారే అవకాశం ఉందని అర్థమైంది. మరొక వైపు, 'మా' లోని కొంతమంది సభ్యులు వర్కింగ్ బోర్డు పదవీకాలం గురించి అడుగుతూ బోర్డుకు లేఖలు రాశారు.
తెలంగాణ స్టేట్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 ప్రకారం, గరిష్టంగా ఆరు సంవత్సరాల లోగా వర్కింగ్ బోర్డును ఎన్నుకోవచ్చు. బైలాస్‌లో వర్కింగ్ కమిటీ ఇంత కాలమే కొనసాగాలని ఎక్కడా పేర్కొనబడలేదని తెలిసింది. ఎన్నికలు జరిగానే కొత్త బోర్డు ఏర్పడడం అనేది ఇంతదాకా జరుగుతూ వస్తున్న వ్యవహారం. అంటే, తదుపరి ఎన్నికలు జరిగి కొత్త బోర్డు ఏర్పడేదాకా ప్రస్తుత బోర్డు కొనసాగుతుందన్న మాట. ఇదే విషయాన్ని 'మా' సభ్యులందరికీ తెలియపరిచారు.
ఎన్నికలకు సంబంధించి జూలై 9న కార్యవర్గం సమావేశం కావాల్సి ఉంది. అయితే అది జరుగుతుందా, లేదా అనేది సందేహాస్పదంగా మారింది. జరిగితే ఎన్నికల తేదీపై క్లారిటీ రావచ్చు. మీటింగ్ జరగకపోతే, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది కూడా పెండింగ్‌లోనే ఉంటుంది. ఇండస్ట్రీలోని కొంతమంది సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగకపోవచ్చుననీ, అవి మరింత ఆలస్యం కావచ్చుననీ అభిప్రాయపడుతున్నారు.
![]() |
![]() |